ఒక్లహామాలో ఘోర విపత్తు

91 మందిని కబళించిన టోర్నడో అతలాకుతలమైన అగ్రరాజ్యం
వాషింగ్టన్‌, మే 21 (జనంసాక్షి) :
ఒక్లహామాలో ఘోర విపత్తు సంభవించింది. టోర్నడో 91 మందిని బలితీసుకుంది. ఈ విపత్తు ధాటికి అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలం అయింది. అమెరికాలోని ఓక్లహామా సిటీలో సోమవారం మధ్యాహ్నం సంభవించిన టోర్నడోలో మృతుల సంఖ్య 91కి చేరింది. ఈ బీభత్సం నుంచి పౌరులు ఇంకా కోలుకోలేదు. మృతుల్లో 20 మంది చిన్నారులున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 145 మంది గాయాలతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో సగం మంది పిల్లలేనని సమాచారం. శిథిలాలను తొలగించే సహాయచర్యలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పలు నివాస భవనాలు, రెండు పాఠశాల భవనాలు, ఆస్పత్రులు నేలమట్టమైపోయాయి. స్కూలు భవనాల శిథిలాలనుంచి చాలామంది చిన్నారులను కాపాడినా ఇంకా చాలా మంది జాడ తెలియడం లేదని స్థానిక అధికారులు పేర్కొన్నారు. కార్లన్నీ తుక్కుతుక్కుగా మారాయి. గాలి 320కి.మీ కన్నా వేగంగా వీచిందని అధికారులు పేర్కొంటున్నారు. టోర్నడోల తాకిడికి అతలాకుతలమైన ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రశాంత జీవనానికి నిలయమైన అగ్రరాజ్యంలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలతో ప్రజలుబెంబేలెత్తిపోతున్నారు. తీవ్రవాద దాడులు, ప్రమాదాలు, విపత్తులు ఎక్కువై ప్రజానష్టం పెరిగిపోయింది. ఒక్లహామా ఘటనలో గాయపడిన వారికి అత్యావసర వైద్య సహాయం అందించేందుకు ఒబామా ప్రభుత్వం సత్వర్య చర్యలు చేపట్టింది. మృతులకు నివాళులర్పించిన ఒబామా, వారి కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని ప్రభుత్వపరంగా అన్ని విధాల సాయమందిస్తామన్నారు.