ఒడిశా కార్మికులను రక్షించిన మంత్రి గంగుల

 

* NDRF బృందాల సహాయం తో ఒడ్డుకు చేరిన కార్మికులు

కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి) :

కరీంనగర్ లోని వల్లంపహాడ్ వాగులో చిక్కుకుపోయిన ఒరిస్సాకు చెందిన 9 మంది ఇటుక బట్టి కార్మికులను మంత్రి గంగుల కమలాకర్ పర్యవేక్షనలో ఎన్డిఆర్ఎఫ్ బృందం సురక్షితంగా ఒడ్డుకు చేర్చి పునరావాస కేంద్రానికి తరలించారు. తెలంగాణ వ్యాప్తంగా గతవారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగునూర్ వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. గంగాధర మండలం నారాయణ పూర్ పెద్ద చెరువుకు గండి పడడంతో రాత్రికి రాత్రి వాగు ఒడ్డుకు ఉన్న ఇటుక బట్టీల చుట్టూ నీరు చేరాయి ఇటుక బట్టీల్లో 9 మంది కార్మికులు చిక్కుకున్నారన్న స్థానిక రైతుల సమాచారంతో జిల్లా మంత్రి గంగుల కమలాకర్ స్పందించి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక కార్యక్రమాలు ముమ్మరం చేశారు..దీనిలో భాగంగా రెస్క్యూ టీం ,NDRF బృందాలతో పాటు స్పీడ్ బోట్ తెప్పించి 9 మంది ఇటుకబట్టీల కార్మికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వర్షాలు తగ్గే వరకు పునరావాస కేంద్రానికి తరలిస్తామని మంత్రి గంగుల వెల్లడించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆర్ వి కర్ణన్, సీపీ సత్యనారాయణ, అన్ని శాఖల జిల్లా యంత్రాంగం, పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.