ఒబామా పర్యటనకు భారీ బందోబస్తు-రాజ్‌నాథ్‌సింగ్‌

2

దిల్లీ, జనవరి 18(జనంసాక్షి) : అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పర్యటన సందర్భంగా కనీవిని ఎరగని రీతిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతున్న నేపథ్యంలో రాజ్‌పథ్‌ వద్ద వీవీఐపీ ఆవరణం చుట్టూ ఏడంచెల భద్రతా వలయాన్ని, గగనతల పర్యవేక్షణకు ప్రత్యేకంగా రాడార్‌ ఏర్పాటు చేస్తున్నారు. వేదికపై ఒబామా రెండు గంటలకు పైగా ఆసీనులు కాబోతున్నందున అమెరికా, భారత భద్రతాధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీవీఐపీ ఆవరణం చుట్టూ, లోపల తూటా రక్షక కవచం ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. దిల్లీలోని ప్రతి ప్రాంతంలోనూ నిఘాకార్యకలాపాలను బహుళ సంస్థ కంట్రోల్‌ రూం పర్యవేక్షించనుంది. ఒబామా..మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 25నే భారత్‌ చేరుకోనున్నారు. అమెరికా సీక్రెట్‌ సర్సీస్‌ సిబ్బంది ఇప్పటికే దిల్లీ, ఆగ్రా చేరుకుని ఒబామా ప్రయాణించే మార్గాలు, రాజ్‌పథ్‌ వద్ద ప్రాథమిక సర్వే నిర్వహించారు. రాజ్‌పథ్‌ వద్ద గణతంత్రదినోత్సవం సందర్భంగా నిర్వహించే వివిధ కార్యక్రమాల గురించి అమెరికా అధికారులకు భారత అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు.

రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో కాకుండా ఒబామా వేరుగా తన వాహనంలో వేదిక వద్దకు రావచ్చు. ఇదే జరిగితే గణతంత్ర దినోత్సవానికి ఒక ముఖ్యఅతిథి వేరుగా రావడం మొదటి సారవుతుంది. ఒక వేళ ఆయన రాష్ట్రపతితోనే కలిసి వస్తే అమెరికా అధ్యక్షుడు ఒకరు… అత్యంత భద్రతా ఏర్పాట్లు ఉండే తన వాహనంలో కాకుండా వేరే వాహనంలో వచ్చిన తొలి అమెరికా అధ్యక్షుడు అవుతారు. అమెరికా అధ్యక్షుడొకరు భారత గణతంత్ర దినోత్సవానికి హాజరు కావడం ఇదే మొదటిసారి.

కేంద్ర భద్రతా సంస్థలు.. ఉగ్రవాద నిరోధక రహస్య దళాలను రాజధానిలో రంగంలోకి దించాయి. ఈ దళాలు వివిధ ¬టళ్లు, అతిథి గృహాలు తదితర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయి. ఒబామా బస చేయనున్న ఐటీసీ మౌర్య ¬టల్‌ను సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బంది ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అమెరికా అధికారులు పర్యవేక్షించే మల్టీ ఫ్రీక్వెన్సీ కంట్రోల్‌ రూంను ఇక్కడ ఏర్పాటు చేశారు. రాజధానిలో ఏర్పాటు చేసిన 15వేల సీసీటీవీల దృశ్యాలను వీక్షించడానికి ఉద్దేశించిన కంట్రోల్‌ రూంలలోని బృందాల్లో అమెరికా భద్రతా సిబ్బంది కూడా భాగంగా ఉంటారు.

80వేల మంది దిల్లీ పోలీస్‌ సిబ్బందితో పాటు 20వేల మందితో కూడిన పారామిలటరీ బలగాలను, హరియాణ, రాజస్థాన్‌ సహా పొరుగురాష్గాల నుంచి సాయుధ పోలీసు బలగాలను, భారత రిజర్వు బెటాలయిన్‌లను రాజ్‌పథ్‌ చుట్టు పక్కల భద్రతా ఏర్పాట్లకు వినియోగించనున్నారు.

వేదిక వద్ద గగనతలంపై ఎటువంటి ఉల్లంఘనలైనా తిప్పికొట్టేందుకు విమాన విధ్వంసక తుపాకులను వ్యూహాత్మక ప్రదేశాల్లో ఏర్పాటు చేశారు. భారత వైమానిక దళం గగనతల భద్రత ఏర్పాట్లతో సిద్ధంగా ఉంది.

రాజ్‌పథ్‌ ప్రాంతం చుట్టుపక్కల ఉన్న కార్యాలయాలను, భూగర్భ మెట్రోను 72 గంటలు ముందుగానే భద్రతా అధికారులు తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. పొంచి ఉండి కాల్పులు జరిపే భద్రతా సిబ్బంది.. వివిధ వ్యూహాత్మక ప్రదేశాల్లో సిద్ధంగా ఉంటారు.

రాష్ట్రపతి ఆతిథ్య కార్యక్రమానికి హాజరయ్యే అతిథౖల జాబితాను భద్రతా కారణాల రీత్యా ఈ సారి కుదిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.