ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్ ను అనుసంధానం తప్పనిసరి

మహబుబ్ నగర్ అర్ సి ,జులై 26,( జనంసాక్షి )
       ఆగస్టు ఒకటి నుండి ఫోటో  ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్ ను అనుసంధానం చేసే విషయంపై ఆధార్ వివరాల సేకరణపై ఓటర్లలో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు,జిల్లా ఎన్నికల అధికారులతో ఓటర్ నమోదు, జాబితాలో సవరణలు, తదితర అంశాలకు సంబంధించిన ఫారాలలో ఆగస్టు 1 ఆధారంగా చేపట్టబోయే సవరణలు, ఓటరు ఫోటో గుర్తింపు కార్డుకు ఆధార్ వివరాల సేకరణ, ఓటర్ ఫోటో  గుర్తింపు కార్డుల ముద్రణ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు,ఎన్నికల అధికారులతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటరు తన ఆధార్ వివరాలను  ఫోటో ఓటర్ గుర్తింపు కార్డుతో ఆనుసంధానం చేయవచ్చని, అయితే ఇది స్వచ్ఛందంగా మాత్రమే చేయవలసి ఉంటుందని, ఎలాంటి బలవంతం లేదని, ఆగస్టు ఒకటి నుండి ఓటర్ల ఆధార్ వివరాలను ఫామ్ -6(బి) లో సేకరించాలని ఆయన జిల్లా కలెక్టర్లకు సూచించారు. బూత్ స్థాయి అధికారులు ఈ వివరాలను సేకరించాలని ఆయన చెప్పారు.  ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం పై, అలాగే  కొత్త ఓటర్ల నమోదు , ఓటరు జాబితాలో  సవరణలు, తదితర అంశాలపై ఓటర్ చైతన్య కార్యక్రమాలను చేపట్టాలని ,ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. ఓటర్ నమోదు ,మార్పులు చేర్పు లకు సంబంధించిన అన్ని ఫారాల  అవసరమైనన్ని కాపీలను సిద్ధంగా ఉంచుకోవాలని, అదేవిధంగా ఆన్లైన్లో కూడా అందరికీ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జనవరి ఒకటి, 2023  తేదీ ఆధారంగా   ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం లో భాగంగా  పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ ను ఆగస్టు 4లోగా పూర్తి చేయాలని, అదేవిధంగా ఓటర్ గుర్తింపు కార్డులలో తేడాలను  అక్టోబర్ 24 లోగా చేయాలని,  నవంబర్ 9 న సమీకృత ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురణ, దీనిపై నవంబర్ 9 నుండి డిసెంబర్ 8 వరకు అభ్యంతరాల స్వీకరణ, అనంతరం ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని, అభ్యంతరాలను డిసెంబర్ 26 లోపు పరిష్కరించాలని, జనవరి 5, 2023  న తుది ఓటరు జాబితాను ప్రచురించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.
       జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకటరావు మాట్లాడుతూ కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించి నివాసాన్ని ఆధారంగా చూపించేందుకు  విద్యుత్ బిల్లు, గ్యాస్ బిల్లు, నీటి కోలాయి బిల్లు వంటివి కొత్తగా నమోదయ్యే ఓటరు
లకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నందున ఈ విషయంపై తగు వివరణ ఇవ్వాలని ప్రధాన ఎన్నికల అధికారితో విజ్ఞప్తి చేశారు .జనవరి ఒకటి ,2023 నాటికి ఓటర్ జాబితా సవరణ కు సంబంధించి శిక్షణ కార్యక్రమాలకు ఇద్దరు తహసీల్దారులను అనుమతించాలని కోరారు.  మహబూబ్ నగర్ లో ప్రస్తుత జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని సూపర్ స్పెషలిటీ ఆసుపత్రికి కేటాయించినందున  ఇక్కడే ఉన్న ఈవీఎం గోదాము సైతం కొత్త కలెక్టరేట్ కు   మార్చాల్సి ఉందని,కొత్త   కలెక్టరేట్ లో నూతన ఈ వి ఎం గోదామును ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని ఇదివరకే ప్రతిపాదనలను పంపినట్లు కలెక్టర్ తెలిపారు.కార్యక్రమంలో  రెవిన్యూ అదనపు కలెక్టర్  కె. సీతారామారావు, డి ఆర్ డి ఓ యాదయ్య, జెడ్పి సీఈవో జ్యోతి ,ఆర్డిఓ అనిల్ కుమార్, మహబూబ్ నగర్ అర్బన్ తహసిల్దార్ పార్థసారథి,కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకులు ప్రకాష్, జాఫర్ తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.