అవిశ్వాసంలో నెగ్గిన కుమారస్వామి

– బలపరీక్షకు ముందే బీజేపీ వాకౌట్‌
– మూజువాణి ఓటుతో విజయం సాధించిన జేడీఎస్‌ -కాంగ్రెస్‌ కూటమి
– కుమారస్వామికి 117 మంది ఎమ్మెల్యేల మద్దతు
– అవిశ్వాస తీర్మాన సమయంలో బీజేపీ, జేడీఎస్‌ మాటల యుద్ధం
– కాంగ్రెస్‌-జేడీఎస్‌ది అపవిత్రమైన కూటమి
– 37సీట్లు గెలిచిన జేడీఎస్‌ ఎలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది?
– సీఎం కుర్చీకోసం కుమారస్వామి దిగజారాడు
– 48గంటల్లో రైతులకు రుణమాఫీ చేయాలి
– లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తాం
– విధానసభలో భాజపా పక్ష నేత యడ్యూరప్ప
– 2006లో బీజేపీతో పొత్తుపెట్టుకోవడం తన జీవితంలో మాయనిమచ్చ
– తన తండ్రి దేవెగౌడ దేశంకోసం జీవితాన్ని త్యాగం చేశారు
– రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయం
– స్పష్టం చేసిన కర్ణాటక సీఎం కుమారస్వామి

బెంగళూరు, మే25(జ‌నంసాక్షి) : ఎన్నికల ఫలితాల నాటి నుంచి దేశవ్యాప్తంగా ఉత్కంఠత రేపిన కర్ణాటక  రాజకీయాలకు తెరపడింది. శుక్రవారం కర్ణాటక విధాన సభలో జేడీఎస్‌ – కాంగ్రెస్‌ కూటమి ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్షలో నెగ్గారు. బలపరీక్ష కంటే ముందే బీజేపీ సభనుంచి వాకౌట్‌ చేయడంతో అవిశ్వాసం లాంఛనమే అయింది. మూజువాణి ఓటుతో జేడీఎస్‌ – కాంగ్రెస్‌ కూటమి సీఎం పీఠాన్ని దక్కించుకుంది. మొత్తం 117మంది సభ్యులు కుమారస్వామి సీఎం అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించారు. దీంతో జేడీఎస్‌ – కాంగ్రెస్‌ కూటమి శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. మరోవైపు కర్ణాటక విధాన సభలో జేడీఎస్‌ వర్సెస్‌ బీజేపీ అన్నట్లు మాటల యుద్ధం సాగింది. శుక్రవారం ఉదయం 12గంటలకు విధానసభలో ముఖ్యమంత్రి కుమారస్వామి విశ్వాస పరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టి ప్రసంగించారు. అనంతరం తీర్మానంపై జరిగిన చర్చలో యడ్యూరప్ప మాట్లాడారు. కాంగ్రెస్‌ – జేడీఎస్‌లది అపవిత్రమైన పొత్తు అంటూ విరుకుపడ్డారు. 37సీట్లు సాధించిన జేడీఎస్‌ ఎలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రశ్నించారు. 16 జిల్లాల్లో జేడీఎస్‌కు సీట్లే దక్కలేదని అన్నారు. అలాంటి జేడీఎస్‌తో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుందని విమర్శించారు. సీఎం కుర్చీ కోసం కుమారస్వామి దిగజారారు అని ఆరోపించారు. తనను సీఎం చేయకపోతే బతకలేనని కుమారస్వామి ప్రజలకు చెప్పారన్నారు. కాంగ్రెస్‌-జేడీఎస్‌లది అపవిత్రమైన పొత్తు అని.. అవకాశవాద మైత్రితో ఏర్పడిన ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి మేలు జరగదని అన్నారు. ఫలితాలు పూర్తిగా రాకముందే జేడీఎస్‌కు కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించింది అని గుర్తుచేశారు. భాజపాను అధికారం నుంచి దూరం పెట్టేందుకే జేడీఎస్‌కు కాంగ్రెస్‌ మద్దతిచ్చిందని మండిపడ్డారు. ప్రజాభీష్టానికి ద్రోహం చేసింది కాంగ్రెస్సా?.. భాజపానా? అని ప్రశ్నించారు. కుమారస్వామి ప్రసంగంలో చాలా సుదీర్ఘంగా మాట్లాడారని.. గతంలో భాజపాతో స్నేహం చేసినందుకు బాధపడుతున్నట్లు పేర్కొన్నారని యడ్యూరప్ప అన్నారు. అయితే సంకీర్ణ ప్రభుత్వంలో తమను చాలా ఇబ్బందులకు గురిచేశారని వెల్లడించారు. 12 ఏళ్లు వనవాసం అనుభవించిన కుమారస్వామికి రోషం ఎక్కువేనని అన్నారు. కుమారస్వామి కులదైవం దుర్యోధనుడు అయి ఉంటాడని
ఎద్దేవాచేశారు. రైతులకు రుణమాఫీ చేయడంలో జేడీఎస్‌ మాటమార్చే విధంగా వ్యవహరిస్తుందని, 48గంటల్లో రైతులకు రుణమాఫీపై సీఎం కుమారస్వామి ప్రకటన చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని యడ్యూరప్ప హెచ్చరించారు. కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేసినందుకు డీకే శివకుమార్‌ చింతిస్తారని అన్నారు. తన పోరాటం కాంగ్రెస్‌పై కాదని, అవినీతిపరులైన దేవెగౌడ, కుమారస్వామిలపైనేనని స్పష్టం చేశారు. యడ్యూరప్ప వ్యాఖ్యలపై కాంగ్రెస్‌-జేడీఎస్‌ సభ్యులు అభ్యంతరం తెలుపుతూ సభలో నినాదాలు చేయడంతో భాజపా నేతలు వాకౌట్‌ చేశారు.కాగా, బలపరీక్షకు ముందే అసెంబ్లీ నుంచి బీజేపీ వాకౌట్‌ చేసింది.
రైతుల సంక్షేమమే తమ ధ్యేయం – సీఎం కుమారస్వామి
తమ కుటుంబానికి, పార్టీకి రైతు ప్రయోజనాలే ముఖ్యమని కర్ణాటక సీఎం కుమారస్వామి స్పష్టం చేశారు. విధాన సభలో అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. తన తండ్రి దేవెగౌడ దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని సీఎం కుమారస్వామి అన్నారు. విశ్వాసతీర్మానాన్ని కుమారస్వామి సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో బీజేపీతో కలిసి దేవెగౌడ మనసు గాయపరిచానన్నారు. దేవెగౌడ సెక్యులర్‌ భావాలు గల వ్యక్తని, తన ఎమ్మెల్యేలను రిసార్ట్స్‌లో ఉంచడం చాలా బాధ కలిగించిందని అన్నారు. 2006లో బీజేపీతో పొత్తుపెట్టుకోవడం తన జీవితంలో మాయని మచ్చని ఆయన అన్నారు. తమ కుటుంబానికి, పార్టీకి రైతు ప్రయోజనాలే ముఖ్యమని కుమారస్వామి స్పష్టం చేశారు. రైతు శ్రేయస్సే కర్ణాటక ప్రభుత్వ ధ్యేయమని, రైతు శ్రేయస్సు గురించి బీజేపీ నేతల నుంచి తెలుసుకోవాల్సిన అవసరంలేదన్నారు. ఏ ఒక్క ప్రాంతానికి, వర్గానికి, కులానికి పరిమితమైన వ్యక్తిని కాదని తనకు అన్ని ప్రాంతాలు, అందరు వ్యక్తులూ సమానమేనని కుమారస్వామి పేర్కొన్నారు.