ఓటు కోసం కోటి తిప్పలు

కేదార్‌నాథ్‌ యాత్రికుల కోసం
బాబు మరో విమానం
బద్రీనాథ్‌కు చేరుకున్న చంద్రబాబు
డెహ్రాడూన్‌/న్యూఢల్లీి, జూన్‌ 27 (జనంసాక్షి) :
ఓటు కోసం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కోటి తిప్పలు పడుతున్నారు. తొమ్మిదేళ్ల కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వీధి పోరాటాలు, ఆందోళనలు చేసినా ఫలితం లేకపోవడం, వస్తున్న మీకోసం పేరుతో 25 వందలకుపైగా కిలోమీటర్లు పాదయాత్ర చేసినా ప్రజల మద్దతు కూడగట్టుకోలేకపోవడంతో చంద్రబాబు కొత్త తరహాలో ఓట్ల కోసం పాట్లు పడుతున్నారు. ఉత్తరాఖండ్‌లో ప్రళయం సృష్టించిన బీభ్సతంలో చిక్కుకొని సర్వం కోల్పోయిన తెలుగువాళ్లను స్వస్థలాలను స్వస్థలాలకు చేరుస్తూ వారితో మొత్తంలో రాష్ట్రంలో ఓట్లు పొందే ప్రయత్నానికి తెరతీశారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగువాళ్లను తరలించడంలో విఫలమైందనే ప్రయత్నం చేస్తూనే తాము అధికారంలో ఉంటే ఇలాంటి పరిస్థితిని తలెత్తనిచ్చే వాళ్లం కాదని చెప్పే ప్రయత్నం చేశారు. ప్రకృతి విపత్తును ఎలా నివారించేవారో అనేది మాత్రం వంద డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతున్న తరుణంలో బాబు కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న యాత్రికుల తరలింపునకు మరో విమానాన్ని అందుబాటులోకి తెచ్చారు. అయితే రాజకీయాలకు భిన్నంగా.. ఆనవాళ్లు లేని రహదారులు.. జోరున వాన.. ఎముకలు కొరికే చలి.. అయినప్పటికీ గుండెకోతకు గురైన వారికి బాసటగా నిలిచారు మన సైనికులు. ఈనెల 17వ తేదీనుంచి 26వ తేదీ వరకు వరకు సుమారు 90వేల మందికిపైగా యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రోడ్డు మార్గాన 28వేల మందిని, హెలికాప్టర్ల ద్వారా 8వేల మందిని తరలించి తన ధైర్యసాహసాలను చాటుకున్నారు. అలాగే భారత వైమానిక దళ సిబ్బంది కూడా తమ సేవలను అందించారు. ఎం17, ఎం26లను సైతం రంగంలోకి దించి ఆపన్నులకు ఆహార పదార్థాలను, మందులను అందజేశారు. గత సోమ, మంగళవారాలలో ప్రకృతి సహకరించకపోయినప్పటికీ తామే వారధులుగా మారి బాధితులను కాపాడారు.. కాపాడుతూనే ఉన్నారు.
కేదార్‌నాథ్‌లో 600 మృతదేహాలు
కేదార్‌నాథ్‌లో బురదలో కూరుకుపోయిన మరో 300 మృతదేహాలను వెలికితీశారు. బుధవారంనాడు 300 మృతదేహాలకు దహన సంస్కారం ఏర్పాట్లు చేసినప్పటికీ వరుణుడు శాంతించకపోవడంతో గురువారం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరగనున్నట్టు తెలిసింది.
సైనికుడు వినాయకం మృతదేహం దగ్ధం
సహాయక చర్యల్లో పాల్గొన్న వాయుసేన ప్రమాద ఘటనలో చిత్తూరు జిల్లాకు చెందిన వినాయకం అనే సైనికుడు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే గాలింపు చర్యల్లో 21 మందికిగానూ 20 మృతదేహాలు లభ్యమైన విషయం విదితమే. వినాయక మృతదేహం దగ్ధమైనట్టు ఆర్మీ ప్రకటించింది. అయితే దగ్ధమైన వినాయక మృతదేహాన్ని గుర్తించేందుకు అతని తల్లిదండ్రుల రక్తనమూనాలను అధికారులు సేకరించారు.
హృషికేష్‌లో చంద్రబాబు
హృషికేష్‌లో ఆశ్రయం పొందుతున్న బాధితులను టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం ఉదయం పరామర్శించారు. అనంతరం బద్రీనాథ్‌కు ఎంపీలు రమేష్‌ రాథోడ్‌, కొనకళ్ల నారాయణతో కలిసి బయలుదేరారు. అక్కడున్న తెలుగు వారిని సాయంత్రం డెహరాడూన్‌కు చేర్చనున్నట్టు తెలిసింది.
ఫోటోలు, సమాచారం అందించండి
హైదరాబాద్‌ : ఆచూకీ లభించని వ్యక్తుల ఫోటోలను ఆయా మండల కేంద్రాలలోనూ, జిల్లా కేంద్రాల్లోనూ అందించాలని, వారి కుటుంబ సభ్యులను, బంధువులను ప్రభుత్వం కోరింది. ఇంకా 278 మంది ఆచూకీ లభించలేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పైవిధంగా ఆదేశాలు జారీచేసింది.
ఆదుకోండి : సీఎం
న్యూఢల్లీి : వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిలకు సిఎం కిరణ్‌ సూచించారు. బద్రీనాథ్‌లో ఉన్నవారిని వాతావరణం అనుకూలించగానే సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు తోడ్పాటు అందించాలని కోరారు. యాత్రికుల రక్షణే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు.