ఓటు హక్కును వినియోగించుకోండి
ఓటు హక్కు పై అవగాహన సదస్సు
ఎన్నికల పరిశీలకులు సురేంద్ర సింగ్ విూనా
వరంగల్,నవంబర్22(జనంసాక్షి): దేశ, రాష్ట్రాల అభివృద్దికి, సరైన నాయకులను ఎన్నుకోవడం ఎంతో కీలకమని, దీనికోసం ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్య వ్యవస్థలో బాగస్వామ్యం అవుతూ, తమ ఓటు హక్కును వినియోగించుకొవాలని వరంగల్ తూర్పు, పశ్చిమ అసెంబ్లి నియోజక వర్గాల ఎన్నికల పరిశీలకులు, సీనియర్ ఐఏఎస్ అధికారి సురేంద్ర సింగ్ విూనా తెలిపారు. కేంద్ర సమాచార శాఖ, స్వీప్ నోడల్ అధికారి వరంగల్ జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో గురువారం కాకతీయ మహిళా డిగ్రీ, పిజి కళాశాలలో ఓటు హక్కు అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం, ఎన్నికల పక్రియను పారదర్శకం చేస్తూ అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని, ఇవి కొనసాగుతాయని విూనా అన్నారు.
వరంగల్ అర్బన్ జిల్లా జాయింట్ కలెక్టర్ దయానంద్ మాట్లాడుతూ.. వివిపాట్ మెషిన్ వల్ల ఓటర్‌లో వోటింగ్ పక్రియ పై మరింత విశ్వాసం పెరిగిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఓటరు అవగాహన కార్యక్రామాలను నిర్వహిస్తూ, ప్రజల్లో వోటింగ్ పక్రియ పై ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తున్నామని అన్నారు. అధిక సంఖ్యలో ప్రజలు ఓటు వేయడం ద్వారా ఆ ప్రాంత అభివృద్ది పై ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎక్కువ దృష్టి పెట్టడానికి అవకాశం ఉందని దయానంద్ వివరించారు. కేంద్ర, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, క్షేత్ర ప్రచార విభాగం ప్రచార అధికారి శ్రీనివాస్ పటేల్ మాట్లాడుతూ, ఓటు హక్కు పై రాష్ట్ర వ్యాప్త ప్రచారం లో భాగంగా, ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా యువత తాము నేర్చుకున్న అంశాలను మరింత మందికి తెలిపి, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేసేట్లు అందరినీ చైతన్య పరచాలని కోరారు. పాత వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలో కళా బృందాల తో ఓటు హక్కు పై చైతన్య కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు. ఎలక్టాన్రిక్ ఓటింగ్, వివిపాట్ యంత్రాల సహాయంతో మాక్ పోలింగ్ కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు.
కాకతీయ విశ్వ విద్యాలయ జాతీయ సేవా పథకం సమన్వయకర్త డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు ఓటరు అవగాహన కార్యక్రామాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని అన్నారు. ప్రతి ఓటరు పోలింగ్
రోజు ఓటు వేయడం తో పాటు, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా, స్వేచ్చగా ఓటు వేసేలా ప్రోత్సహించడం కోసం, ఇలా చైతన్య కార్యక్రమాలు జరుగటం సంతోషకరమని అన్నారు. చిందు యక్ష గాన కళాబృందం నాయకుడు గడ్డం సుదర్శన్ తమ కళారూపం ద్వారా ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించింది. ఈ కార్యక్రమ్ లో వరంగల్ అర్బన్ జిల్లా అభివృద్ది అధికారి రాము, సీనియర్ అడ్వొకేట్లు విద్యాసాగర్,వీరభద్రా రావు, కాకతీయ మహిళా కళాశాల సెక్రటరీ మట్టేవాడ మాధవ్, ఫైనాన్స్ డైరెక్టర్ మామిడి దయాకర్, కళాశాల ప్రిన్సిపల్ మంజులాదేవి, ఇంకా అధిక సంఖ్యలో విధ్యార్థులు పాల్గొన్నారు.