ఓట్లు కొనేందుకే నగదు బదిలీ
యూపీఏ-2 సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న నగదు బదిలీ పథకం 2014 ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసేందుకునేనని అవగతమవుతుంది. కేంద్రంలో రెండో సారి అధికారం చేపట్టిన వెంటనే మన్మోహన్‌సింగ్ విప్రో వైస్ చైర్మన్ నందన్ నిలేఖనిని తీసుకువచ్చి చైర్మన్ ఆఫ్ ఇండియన్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా పదవిలో కూర్చోబెట్టారు. భారతీయులందరికీ కామన్ ఐడెంటిటీ కార్డుల జారీ ప్రక్రియ (ఆధార్)కు శ్రీకారం చుట్టారు. ఆధార్ ఆధారంగానే భవిష్యత్ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ప్రకటించారు. భారీ ప్రణాళికతో చేపట్టిన బృహత్ ప్రణాళిక అమలుకు ఎన్నో అవరోధాలు, మరెన్నో అడ్డంకులు వచ్చిపడ్డాయి. ప్రైవేటు ఏజెన్సీల నిర్లక్ష్యంతో జంతువులు, ఇళ్ల ఫొటోలతో సైతం కార్డులు జారీ అయ్యాయి. ఇప్పటికీ కార్డుల జారీ ప్రక్రియలో అనేక అవాంతరాలు ఎదరువుతున్నాయి. అయినా ఆధార్ ఆధారంగానే నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రధాని మన్మోహన్‌సింగ్ సంకల్పించారు. ఈమేరకు సోమవారం రాత్రి ఢిల్లీలో 18 శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. 2013 జనవరి ఒకటి నుంచి 15 రాష్ట్రాల్లోని 51 జిల్లాల్లో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు పూర్తిస్థాయిలో సిద్ధపడాలని అధికారులు, మంత్రులను ఆదేశించారు. క్రమక్రమంగా 2014 చివరి నాటికి దేశవ్యాప్తంగా విస్తరించాలని తెలిపారు. అయితే అమలులో ఉన్న ప్రతిబంధకాలను మాత్రం ప్రధానిలాంటి పెద్ద మనిషి విస్మరించారు. కేవలం 2014 ఎన్నికల్లో లబ్ధిపొందడం మినహా ప్రజలకు మేలు కలిగించే ఉద్దేశం వారిలో ఇసుమంతైనా కనిపించలేదు. రాహుల్‌బాబును ప్రధానిగా ప్రమోట్ చేయాలనే తలంపుతో ప్రజలకు ఎదురవబోయే కష్టనష్టాలను ఆర్బీఐకి గవర్నర్‌గా వ్యవహరించిన మన్మోహన్‌సింగ్ విస్మరించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాబోదు. పాలకులు ప్రజలను సొంత బిడ్డల వలే చూసుకోవాలి. వారికి కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించడం పాలకుల బాధ్యత. కానీ ఈ బాధ్యత నుంచి పాలక పక్షాలు క్రమక్రమంగా దూరమవుతున్నాయి. ఎన్నికల సమయంలో మాత్రమే తాయిలాలు ప్రకటిస్తే ఓటర్లు అన్ని మర్చిపోయి చేతి గుర్తుపై గుద్దేస్తారనే అతివిశ్వాసం కాంగ్రెస్ పార్టీ నేతల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. లబ్ధిదారుల ఖాతాల్లో సబ్సిడీలు జమ చేయడం ద్వారా ప్రభుత్వం నుంచి నేరుగా నగదు అందిస్తున్నామనే యోచనకు వారు రావాలని పాలకులు భావిస్తున్నారు. ఇంతకుముందు ఇలాంటి పనిచేసిన వారు ఎవరూ లేరు కాబట్టి తమకే తిరిగి పట్టం కడతారని వారు భావిస్తున్నారు. అయితే లబ్ధిదారులు ముందు నగదు చెల్లించి సరుకులు కొనుగోలు చేసిన తర్వాతే ప్రభుత్వం నుంచి సబ్సిడీ మొత్తం ఖాతాల్లో జమ అవుతుంది. నగదు బదిలీ పరిమితి కూడా రూ.40 వేల వరకు ఉండటం కలవరపాటుకు గురి చేస్తోంది. లీటర్ కిరోసిన్ కొనుగోలుకే అదనంగా రూ. 30 చెల్లించలేని నిరుపేదలు ముందు రూ. 40 వేల విలువైన సేవలు పొందే అవకాశముందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ పాలకులు మాత్రం ఇవేమి పట్టించుకోవడం లేదు. మంగళవారం దీనిపై కొనసాగింపు సమావేశం నిర్వహించిన ఆర్థికమంత్రి చిదంబరం మాట్లాడుతూ, సబ్సిడీ పథకాలు అనర్హులకు అందకుండా చేసేందుకే ఆధార్ ఆధారంగా నగదు బదిలీ పథకం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, సాధ్యాసాధ్యాలు కూడా పట్టించుకోకుండా ఆయన ఇలాంటి ప్రకటన చేయడం సరికాదు. ఇప్పటికే అమలుకు ప్రకటించిన జిల్లాల్లో ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తి చేయలేదు. పథకం ప్రారంభానికి ఇంకా కేవలం నెల రోజులు మాత్రమే. అన్ని శాఖలు సమన్వయంగా పనిచేస్తే మాత్రమే పథకం సత్ఫలితాలు ఇస్తుంది. లేదంటే ప్రభుత్వం పరువు బజారున పడటం ఖాయం. అప్పుడు యువరాజు పట్టభిషేకం కాదు కదా ప్రజల ఆగ్రహాన్ని తప్పించుకోవడం కూడా కాంగ్రెస్ పార్టీ తరం కాదు. ప్రభుత్వం ఓట్ల కొనుగోలుకు చూపిస్తున్న హడావిడి పథకం అమలుపై అనేక సందేహాలకు తావిస్తోంది. ఓట్ల రాజకీయాన్ని పక్కనపెట్టి పేద ప్రజలకు లబ్ధి కలిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.