ఓట్ల కోసమేనా తాపత్రయం?
పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడి కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న అప్జల్‌గురును శనివారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఉరి తీసినట్లు కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటించారు. న్యాయనిపుణుల సూచన మేరకే ఆయనను ఉరితీసినట్లు ఆయన చెప్పారు. గురు స్వస్థలం జమ్మూకాశ్మీర్‌లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అప్జల్ గురు క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి తిరస్కరించిన తర్వాతనే ఉరితీశామని, ఈ విషయం ముందుగా మీడియాకు తెలియజేయడం తగదని హోంశాఖ కార్యదర్శి ఆర్‌కే సింగ్ తెలిపారు. దేశంలో రెండు నెలల కాలంలో ఉరిశిక్షను అమలు చేయడం ఇది రెండోసారి. 2012 నవంబర్ 21న పూణెలోని యెరవాడ జైళ్లో ముంబయి బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు అజ్మల్ కసబ్‌ను ఉరితీశారు. 2001 డిసెంబర్ 13న పార్లమెంట్‌లోకి ఐదుగురు ఉగ్రవాదులు చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో తొమ్మిదిమంది మృతిచెందగా, భద్రతాదళాలు జరిపిన దాడిలో ఉగ్రవాదులంతా హతమయ్యారు. ఈ దాడులకు సూత్రదారిగా పేర్కొంటూ అప్జల్‌గురును పోలీసులు అరెస్టు చేశారు. దేశ సార్వభౌమత్వంపై యుద్ధం ప్రకటించాడని, ఆయన జైషే మహ్మద్ ఉగ్రవాది అని ప్రకటించారు. లష్కర్ యే తోయిబాతోనూ సంబంధాలున్నాయని అభియోగాలు నమోదు చేశారు. పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడి జరగడానికి కొద్దిసేపటి ముందే అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పటి ఉపప్రధానితో పాటు, కేంద్ర మంత్రులు, ఎంపీలు పార్లమెంట్‌లోనే ఉన్నారు. దేశ పాలనావ్యవస్థకు గుండెకాయలాంటి పార్లమెంట్‌పై దాడికి అప్జల్‌గురు సూత్రదారి అని ఆయనకు గతంలో ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని భద్రతా దళాలు పేర్కొన్నాయి. 2002లో ఆయన పోటా కోర్టు ఉరిశిక్ష విధించింది. ఆయన ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేయగా 2003లో పోటా కోర్టు తీర్పును హైకోర్టు నిర్ధారించింది. దీనిని సవాల్ చేస్తూ అప్జల్‌గురు సుప్రీం కోర్టులో సవాల్ చేయగా, 2005లో ఆయన పిటిషన్ సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. 2006 అక్టోబర్ 3న క్షమాభిక్ష ప్రసాదించాలని అప్జల్‌గురు భార్య అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాంకు పిటిషన్ పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఆయన ఢిల్లీలోని తిహార్ జైల్‌లో ఖైదీగా ఉన్నారు. ఈనెల 3న రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడంతో జైలు అధికారులు కోర్టు తీర్పును అమలు చేశారు. అయితే ప్రపంచ దేశాలన్నీ మరణ శిక్షను రద్దు చేయాలని కోరుతున్న సమయంలో భారత్ మరణ శిక్ష అమలు చేయడం వెనుక ఉన్న ఉద్దేశాలు వేరు. మతతత్వ పార్టీగా చెలమణీలో ఉన్న బీజేపీ నరేంద్రమోడీని ప్రధాని అభ్యర్థిగా ముందుకు తీసుకురావడంతో కాంగ్రెస్ పార్టీ హిందువుల ఓట్లు గల్లంతవుతాయని భావించింది. మైనార్టీలు ఎలాగైనా తమకే ఓట్లు వేస్తారని భావించింది. ఈ ధీమాతోనే అప్జల్‌గురును ఉరితీసింది. 2014లోనో, అంతకంటే ముందో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే తాపత్రయమే ఉరిశిక్ష అమలులో కనిపించింది. కానీ కాంగ్రెస్ పార్టీ గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత యూపీలో మైనార్టీలు ప్రాంతీయ పార్టీలను ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారే తప్ప, కాంగ్రెస్ ఆదరించలేదు. ఉరి శిక్షల అమలు వెనుక పక్కా రాజకీయ వృహాలే తప్ప వేరు కారణాలు కనిపించడం లేదు. ఆయనపై నమోదు చేసిన చార్జిషీట్‌లోనూ అనేక లోటుపాట్లున్నట్టు న్యాయనిపుణులు పేర్కొన్నారు. మరణశిక్ష యావజ్జీవ ఖైదుగా మారుతుందనుకున్న సమయంలో ఉరితీయడం అనేక అనుమానాలకు తావిచ్చింది. అప్జల్‌గురును చాలా దగ్గరిగా చూసిన స్నేహితులను ఉటంకిస్తూ కొద్ది రోజుల క్రితం ‘ద వీక్’ ఒక కథనాన్ని ప్రచురించింది. మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన అప్జల్‌గురు తండ్రి మరణం తర్వాత ఎన్నో కష్టాలు అనుభవించినా చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. తండ్రి కలలు కన్నట్టుగా మెడిసిన్‌లో సీటు సాధించినా ఎంబీబీఎస్ పూర్తి చేయలేకపోయాడు. పాఠశాల సమయం నుంచే హాస్య చతురుడైన గురు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనేవాడు. సంగీతం అంటే చెవికోసుకునేవాడు. కవిత్వమంటే ఆయనకు ప్రాణం. మీర్జా గాలిబ్, అలామా ఇక్బాల్ ఆయనకు అభిమాన కవులు. గురు కుమారుడి పేరుకూడా గాలిబ్. సున్నిత మనస్కుడైన గురు జమ్మూ అండ్ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్‌లో చేరడమే ఆయన చేసిన తప్పిదమని ఆయన స్నేహితులు పేర్కొన్నారు. హక్కుల కోసం ఉద్యమించడం తప్ప ఎవరికీ హాని తలపెట్టని గురును తర్వాతి కాలంలో భద్రత దళాలు ఉగ్రవాదిగా ముద్ర వేయడానికి ఆయన లిబరేషన్ ఫ్రంట్‌లో ప్రవేశించడమే కారణమని వారు పేర్కొన్నారు. ఆయనకు ఉరిశిక్ష అమలు చేసినట్టు మీడియా ద్వారా విభిన్న వర్గాలు వివిధ రకాలుగా స్పందించారు. వారి స్పందనను తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకుల వ్యాఖ్యలు ఇందుకు మినహాయింపు కాదు. ఏడేళ్లుగా జాప్యం చేస్తూ వస్తున్న శిక్ష ఇంత ఆగమేఘాల మీద అమలు జరిపారంటే దీని వెనుక వేరే ఉద్దేశాలముంటాయి? భారత్ అలీన దేశం. అలీన దేశాలన్నీ మరణ శిక్షను వ్యతిరేకిస్తున్నాయి. స్వతహాగా శాంతికాముక దేశంగా పేరున్న భారత్ కూడా మరణ శిక్షకు వ్యతిరేకమే. మరి అలాంటి శాంతికాముక దేశం తన బిడ్డను బలితీసుకుంది. ఉగ్రవాదిగా నెపం మోపి ఊపిరితీసింది. అప్జల్‌గురు భార్య తబస్సుం రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్నప్పుడు అప్జల్ ఇలా వ్యాఖ్యానించాడు ‘నాకు దయాభిక్ష పెట్టమని మీరు అడగొద్దు’ అని. తనకు తానుగా పెట్టుకున్న మెర్సీ పిటిషన్‌లో ఇలా రాశాడు ‘నేను చేయని తప్పుకు పడిన శిక్షనుంచి నన్ను తప్పించమని నేనస్సలు కోరను’ అని. తాను ఉగ్రవాదిని కానని, అనవసరంగా ఇరికించారని అప్జల్ గురు చెప్పుకున్నాడు. దర్యాప్తు సంస్థలు మాత్రం ఆయనే సూత్రదారి అని నిర్ధారించాయి. కోర్టు తీర్పును తీహార్ జైలు సిబ్బంది అమలు పరిచారు. కనీసం ఆయన మృతదేహాన్ని కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వలేదు. ఇది సహేతుకం కాదు. ఆయన సమాధి దేశంపై యుద్ధం ప్రకటించే వారికి, సంఘవిద్రోహ శక్తులకు దేవాలయంగా మారుతుందని భయ పడటం, భ్రమ పడటం ఎంత వరకు సమంజసం. పాలకుల దృష్టికోణంలో మార్పురావాలి. ఓట్ల కోసమో, ఇతర కారణాలతోనో తమ బిడ్డలను తామే పొట్టనపెట్టుకోవడం సరికాదు. దేశ పౌరుల్లో జాతీయ భావం పెంపొందించేందుకు మొదట కృషి చేయాలి. తప్పు చేసిన వారిలో మార్పు తీసుకువచ్చేందుకు కృషి చేయాలి.