ఓట్ల లెక్కింపునకు విస్తృత ఏర్పాట్లు
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట భద్రత
నేడు లెక్కింపు సిబ్బందికి మలివిడత శిక్షణ
హైదరాబాద్,డిసెంబర్8(జనంసాక్షి): ఈ నెల 11న ఓట్ల లెక్కింపునకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిశోర్ స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 15 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు సంబంధించి 15 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే లెక్కింపు సిబ్బందికి తొలి విడత శిక్షణ పూర్తి అయిందన్నారు. ఈ నెల 10న ఓట్ల లెక్కింపు సిబ్బందికి రెండో విడత శిక్షణ ఇస్తామని చెప్పారు. లెక్కింపులో ముందుగా మొదటి అర్ధగంటలో పోస్టల్ బ్యాలెట్‌ల లెక్కింపు, ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు చేయనున్నారు. కౌంటింగ్ ఏంజెట్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇస్తామని, మొబైల్ ఫోన్లు, పేపర్లను కౌంటింగ్ హాల్‌లోకి అనుమతించమని దాన కిశోర్ స్పష్టం చేశారు.
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లు మూడంచెల పటిష్ట భద్రత, సీసీ కెమెరాల నిఘా నీడలో ఉన్నాయి. ప్రతీ ఓట్ల లెక్కింపు కేంద్రంలో 14 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. లెక్కింపు కేంద్రంలో రిటర్నింగ్ అధికారికి ప్రత్యేక టేబుల్, ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్‌వైజర్, అసిస్టెంట్ సూపర్‌వైజర్, మైక్రో అబ్జర్వర్ ఉంటారని చెప్పారు. రాజధాని నగరంలో ఎన్నికల నిర్వహణను సవాల్‌గా స్వీకరించిన పోలీస్ ఉన్నతాధికారులు మూడు కమిషనరేట్ల పరిధుల్లో పోలింగ్ ప్రశాంతంగా పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. ముగ్గురు పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్, వి.సి.సజ్జనార్, మహేష్ భగవత్‌లు ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితులను కల్పించారు. ఇందుకోసం రెండు నెలల ముందు నుంచి ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చి వాటిని అమలు చేశారు. పాతబస్తీలో సజ్జరన్నార్, ప్రధాన పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకునే ప్రాంతాలు బాలాపూర్, మహేశ్వరం,
పహడీషరీఫ్, ఉప్పల్ వంటి చోట్లకు మహేష్ భగవత్ స్వయంగా వెళ్లి భద్రతను పర్యవేక్షించారు.