ఓపెన్‌ కాస్టులతో బతుకులు బుగ్గి

ఇచ్చిన హావిూలను ఎందుకు అమలు చేయలేదు

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): తెలంగాణలో ఓపెన్‌కాస్టులకు స్థానం లేదన్న హావిూ మేరకు ఓసీపీల పేరుతో జరుగుతున్న నష్టాన్ని ఆపాలని ప్రభుత్వాన్ని సింగరేణి కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. నాలుగేళ్లయినా ఈ దిశగా ఎందుకు చర్య తీసుకోలేదో చెప్పాలన్నారు. అడ్డగోలుగా ఉపరితల గనులను తవ్వి ప్రజలను నష్టపరచొద్దన్నారు. మనుషులకు నష్టం జరుగకుండా బొగ్గును తవ్వుకోవాలి, భవిష్యత్తులో ఓసీపీలు బందు చేయడం మేలన్నారు. బతుకు దేరువు దెబ్బతీసే ఓసీపీలు కాకుండా మరో మార్గంలో చూడాలని తెలంగాణ సూచించారు. ఇప్పటికే ఓసీపీల ద్వారా నష్టపోయిన వాళ్లకు పరిహారం ఇవ్వాలన్నారు. సింగరేణిలో భూములు కోల్పోయిన వారికి భూములు ఇవ్వాలని, ఇక్కడ వచ్చే ఉద్యోగాలు ఆదివాసులకు ఇవ్వాలన్నారు. సింగరేణి నష్టపోయిన గిరిజనులకు పునరావాసం, భూమిని చూపాలని, బతుకుదెరువు చూపాలన్నారు. కొత్తగా తవ్వే అబ్బాపూర్‌ ఓసీపీని ఆపాలని, మనుషులకు నష్టం చేయకుండా బొగ్గును తవ్వుకోవాలని, మనుషులను, అడవులను ఆగం చేయవద్దన్నారు.వట్టివాగు ప్రాజెక్టు ఓబీ మట్టితో నిండిపోతున్నాయని, 24,500 ఎకరాలకు పారవల్సిన నీరు కేవలం 5వేలకు మించి సాగు నీరు అందించలేకపోతున్నారన్నారు. హక్కులను సాధించుకోవడానికి సమష్టిగా ముందుగా రావాల్సిన అవసరం ఉందన్నారు. ఓసీపీలకు సంబంధించిన డంప్‌యార్డుల నుంచి మట్టి వస్తుందనే విషయాన్ని గమనించాలన్నారు. సింగరేణితో జరుగుతున్న నష్టాన్ని గమనించాలని మరోవైపు గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవులను నరికి రోడ్డు వేశారు, బొగ్గును తీశారని, ఇప్పుడు ఇక్కడో చెట్టు.. అక్కడో చెట్టు పెడితే అడవి పెరుగుతుందా? అని గిరిజనులు అన్నారు.