ఔను! మేం రాజీనామా చేశాం నేరం మాది కాదు కేబినెట్‌ది

నిర్దోషులుగా బయటపడతాం

ధర్మాన, సబితహైదరాబాద్‌, మే 20 (జనంసాక్షి) :పరిపాలన వ్యవహారాల్లో ఒక్కరోజూ తప్పుచేయలేదని ధర్మాన ప్రసాద్‌రావు, సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తాము మంత్రి పదవులకు రాజీనామా చేసింది వాస్తవమేనని, రాజీనామాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. జగన్‌ అక్రమాస్తుల కేసులో తాము బలిపశువులయ్యామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేబినెట్‌ సమష్టి నిర్ణయాల మేరకే తాము జీవోలు జారీ చేశామని తెలిపారు. సబిత, ధర్మాన రాజీనామా చేశారని మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుండడంతో మంత్రులు రఘువీరారెడ్డి, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి, కొండ్రు మురళి, ఆనం రామనారాయణరెడ్డి, వట్టి వసంతకుమార్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేశవరావు తదితరులు సోమవారం వారివురిని వేర్వేరుగా కలసి మాట్లాడారు. అసలేం జరిగిందో ఆరా తీశారు. తాము ఎలాంటి తప్పులు చేయలేదని, అప్పటి కేబినెట్‌ నిర్ణయాలను అమలు చేశామని సబిత, ధర్మానలు చెప్పినట్లు తెలిసింది. అధిష్టానం కూడా తమకు సహకరించేది పోయి ఇలా గొంతుకోస్తుందని కలలో కూడా ఊహించలేదని వారు విచారం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘మేము అవినీతికి పాల్పడలేదు.. పైగా మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయం అమలు చేశాం. కానీ ఇప్పుడేమే అప్రతిష్ట మూట కట్టుకోవాల్సి వస్తుంది’ అని వారు వాపోయారు. ‘మీరు ఏ తప్పు చేయలేదని మాకూ తెలుసు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అధిష్టానాన్ని ఒప్పించేందుకు ఎంతో ప్రయత్నించారు. కానీ కేంద్రంలో నెలకొన్న పరిణామాలు మిమ్మల్ని చుట్టుముట్టాయి’ అని సహచర మంత్రులు వారిని సర్దిచెప్పినట్లు తెలిసింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో అసలు మంత్రులకు స్వేచ్ఛ లేదు. ఎక్కడ సంతకాలు చేయమంటే అక్కడ చేశారు. ఇప్పుడు అదే కొంపముంచిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. వైఎస్‌ వల్లే మంత్రులు అప్రతిష్ట మూట కట్టుకోవాల్సి వస్తుందని, వారి రాజకీయ భవిష్యత్‌ను పణంగా పెట్టాల్సి వస్తుందన్నారు. కాగా, సోమవారం సాయంత్రం ధర్మాన తన సొంత జిల్లా శ్రీకాకుళానికి వెళ్లారు. మంగళవారం తన పుట్టిన రోజు అక్కడే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. 30 సంవత్సరాలుగా పార్టీ కోసం ఎంతో శ్రమిస్తే చివరకు ఇదా ఫలితమని ఆయన వాపోయినట్లు తెలిసింది. అందుకే ఆయన ఎమ్మెల్యే, పార్టీకి కూడా రాజీనామా చేసే అవకాశాలు లేకపోలేదని ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది. ఇదిలాఉండగా, సోమవారం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్‌ వేర్వేరుగా గవర్నర్‌ ఈఎల్‌ నరసింహన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఆయన ఆరా తీసినట్లు తెలిసింది. గవర్నర్‌తో భేటీ ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని డీఎస్‌ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.