కంప్యూటర్ కోర్సుల్లో యువతకు శిక్షణ
వరంగల్,జనవరి18(జనంసాక్షి): దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రావిూణ కౌశల్య యోజన(డీడీయూ-జీకేవై), ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్, మార్కెటింగ్ మిషన్ (ఇజీఎంఎం) ద్వారా డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. అయితే ఇప్పటికే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందు కలెక్టర్ చొరవతో జిల్లాలో తొలిసారి ఏర్పాటు చేసిన వారధి సంస్థ కూడా జిల్లాలో నియామకాలను ప్రారంభించింది.గ్రావిూణ, పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సభ్యుల కుటుంబాల్లోని నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ ఇస్తారు. కంప్యూటర్‌లో ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ కాన్సెప్ట్, కమ్యూనికేటివ్ ఇంగ్లిష్, లైఫ్‌స్కిల్స్, సాఫ్ట్‌స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, బాడీ లాంగ్వేజీ, ఇంటర్వ్యూ స్కిల్స్, వర్క్‌రెడినెస్ మాడ్యూల్స్‌లో ప్రతీ 35మంది బ్యాచ్‌కి శిక్షణ ఇస్తారు. చదువుకున్న నిరుద్యోగులుగా విలువైన సమయాన్ని వృథాగా గడుపుతున్న వారితోపాటు చదువు పూర్తిచేసి, అర్ధాంతరంగా మానేసి, ఉద్యోగాలు దొరక మళ్లీ చదువు కొనసాగించలేక నిరాశ నిస్పృహకు లోనవుతున్న వారికోసం శిక్షణ ఇస్తారు. 18నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి పదో తరగతి అర్హత, ఇంటర్ ఆపైన చదువు మానేసిన పురుషులకు,మహిళ అభ్యర్థులకు శిక్షణ ఇస్తారు. శిక్షణ అనంతరం వివిధ కంపెనీల్లో అర్హత మేరకు ఉద్యోగాలు కల్పిస్తారు. ప్రధానంగా శిక్షణ, జాబ్‌మేళా, ఔట్‌సోర్సింగ్ సేవల కింద ఉద్యోగ నియామకాలు అనే మూడు ప్రధాన ఉద్దేశ్యాలతో నిరుద్యోగులకు ఆసరాగా వారధి సొసైటీ పనిచేస్తోంది. ఔట్‌సోర్సింగ్ విభాగం కింద జిల్లా పరిధిలోని ప్రభుత్వశాఖల్లో ఖాళీలను జిల్లాకు చెందిన వారికే అవకాశం కల్పించి భర్తీ చేయడం వంటి అంశాల్లో వారధి తనవంతుగా ఆసరా అందించబోతోంది. ప్రతీ కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పించడం ద్వారా పేద కుటుంబాన్ని ఆర్థిక స్వావలంబనతో ఆదుకునేందుకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఇది తీసుకుంటోంది. ఇందుకోసం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రావిూణ కౌశల్య యోజన(డీడీయూ-జీకేవై), ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్, మార్కెటింగ్ మిషన్ (ఇజీఎంఎం) ద్వారా డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో కంప్యూటర్ పరిజ్ఞానం, కమ్యూనికేటివ్ ఇంగ్లిష్, లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, బాడీ లాంగ్వేజీ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలంలో 90రోజుల పాటు ఉచిత భోజన, వసతి కల్పించి శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లో ఎంపిక చేస్తారు.