కటక్‌ వేదికగా నాలుగేళ్ల విజయ ప్రస్థానం

ఒడిషా ఎన్నికల్లో విజయానికి వ్యూహం
పావులు కదుపుతున్న బిజెపి
26న కటక్‌ నుంచి ప్రధాని మోడీ ప్రచారం
భువనేశ్వర్‌,మే23( జ‌నం సాక్షి): ఒడిషాలోనూ పాగా వేయాలని బిజెపి పావులు కదుపుతోంది.  ఒకవైపు ఒరిస్సా వ్యూహంతో పాటు, కేంద్రంలో సాధించిన నాలుగేళ్ల పాలనా విజయాలను ప్రజల ముందుంచేందుకు ప్రధాని మోడీ కటక్‌ కేంద్రంగా ప్రచారం ప్రారంభించనున్నారు. ఒడిశాలో 120 అసెంబ్లీ స్థానాలు గెలవాలన్న పట్టుదలతో భాజపా వ్యూహాలు రచిస్తోంది. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిని ప్రయోగశాలగా చేసి అభివృద్ధి పనులు చేపడతామని ప్రధాని మోదీ కూడా చెప్పారు. ఆయన పదవి చేపట్టిన నాలుగేళ్ల కాలంలో భువనేశ్వర్‌, బాలేశ్వర్‌, బరగఢ్‌, పరదీప్‌లలో ఆరుసార్లు పర్యటించారు. గతేడాది ఏప్రిల్‌ 15న రాష్ట్ర రాజధానిలో ఏర్పాటైన కమలదళం కార్యవర్గం సమావేశంలో రెండు రోజులు పాల్గొన్న మోదీ భద్రతా వలయం దాటి ప్రజల్లోకి వెల్లిన సంగతి విదితమే. తన ప్రసంగాలతో కళింగ వాసులపై సమ్మోహనాస్త్రం సంధించారు. ఇటీవల కాలంలో 21 రాష్టాల్లో పాలనా పగ్గాలు సాధించిన తూర్పు తీరంలోని ఒడిశా, పశ్చిమ్‌బంగపై గురిపెట్టాయి. 2019 ఎన్నికల్లో గెలుపు ధ్యేయంగా కమల దళపతి అమిత్‌ షా ఒడిశాలో ‘మిషన్‌ 120’ పేరిట వ్యూహరచన చేసిన సంగతి విదితమే. 147 స్థానాలున్న అసెంబ్లీలో తిరుగులేని ఆధిక్యత సాధించాలన్న ఎత్తుగడ కల ఆపార్టీ అగ్రనేతలు సమగ్ర కార్యాచరణతో ముందస్తు ప్రచారం ఇదివరకే ప్రారంభించారు. నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకోనున్న ప్రధాని మోదీ ఈ నెల 26న కటక్‌ బాలిజాతర మైదానం వేదికగా దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. విజయోత్సవాన్ని ఒడిశా పూర్వ రాజధాని కటక్‌ ను ఎంపిక చేసుకోవడం వెనుక వ్యూహం తరుముకొస్తున్న ఎన్నికలే అని చెప్పవచ్చు. తమ హయాంలో సాధించిన విజయాలను దేశ ప్రజలకు వివరించనున్నారు. నాలుగేళ్లలో ఒడిశాకు కేంద్రం కేటాయించిన నిధులు, పరదీప్‌ను పారిశ్రామిక కారిడార్‌గా చేయడం, వెనుకబడిన జిల్లాల్లో వైద్యకళాశాలల ఏర్పాటుకు అనుమతులు, భువనేశ్వర్‌లో త్రిపుల్‌ ఐటీ, సంబల్‌పూర్‌లో ఐఐఎం, బ్రహ్మపురలో ఐజర్‌ తదితర భారీ నిర్మాణాలకు సంబంధించి తెలియజేయనున్నారు. మరోవైపు 18 ఏళ్ల నవీన్‌ పట్నాయక్‌ పాలనా కాలం వైఫల్యాలను పూసగుచ్చినట్లు వివరిస్తారని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఇటీవల విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. అయిదేళ్లు భాజపాకు అధికారమిస్తే ప్రగతి రథచక్రాలు ముందుకు కదులుతాయని భరోసా కల్పించి ఓటు బ్యాంకుపై గురిపెట్టాలని మోదీ ఎత్తుగడ వేశారు. అందుకే నాలుగేళ్ల విజయోత్సవాన్ని కటక్‌లో నిర్వహిస్తున్నారని స్పష్టమైంది. ఒడిశాను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని, వివక్ష చూపుతోందని నవీన్‌ తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానిపై ఎలాంటి విమర్శలు చేయకపోవడం గమనార్హం. మరోవైపు తరచు ఒడిశా పర్యటనకొస్తున్న అమిత్‌ షా మాత్రం ముఖ్యమంత్రిని దుయ్యబడుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో తన నాలుగేళ్ల ప్రగతి కార్డు వివరించడానికొస్తున్న మోదీ ఈసారి నవీన్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడతారా? అన్నదిప్పుడు చర్చనీయంగా ఉంది. ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో మోదీ రాష్ట్రానికొస్తుండగా కమలదళంలో ఉత్సాహం పెల్లుబుకుతోంది. ‘మిషన్‌ 120’ ఎత్తుగడ సాకారానికి ప్రధాని పర్యటన కలిసోస్తుందని ఆ పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బసంత్‌ పండా చెప్పారు. గతేడాది పంచాయతీ ఎన్నికల్లో ద్వితీయ స్థానానికి ఎదిగిన భాజపా ఇటీవల జరిగిన బిజెపూర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో కటక్‌ సమావేశాన్ని విజయవంతం చేసి ఓటు బ్యాంకుపై గురిపెట్టాలన్న లక్ష్యంతో కమలదళం అగ్రనేతలు విస్తృత ఏర్పాట్లు ప్రారంభించారు.