కట్జూ.. మా కార్యక్రమానికి రావొద్దు

ముఖ్య అతిథిని బహిష్కరించిన దక్కన్‌ టీవీ
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందన్న ప్రెస్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ మార్కండేయ కట్జూ వ్యాఖ్యలపై దక్కన్‌ టీవీ మండిపడింది. టీవీ లోగో ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరుకావాలంటూ ఆయనను ఆహ్వానించిన దక్కన్‌ టీవీ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా మాట్లాడిన కట్జూ మా కార్యక్రమానికి రావొద్దంటూ స్పష్టం చేసింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ప్రతిఫలింపజేసేందుకు దక్కన్‌ టీవీని ప్రజల ముందుకు తీసుకురావాలని సంస్థ యాజమాన్యం సంకల్పించింది. టీవీ లోగో ఆవిష్కరణకు ప్రెస్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. లోగో ఆవిష్కరణకు ఒక రోజు ముందు కట్జూ తెలంగాణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తాము ఏ లక్ష్యంతోనైతే టీవీ తీసుకువస్తున్నామో దానినే వ్యతిరేకించిన కట్జూ కార్యక్రమానికి రావాల్సిన అవసరం లేదని దక్కన్‌ టీవీ యాజమాన్యం పేర్కొంది. దీంతో కట్జూ అధికారిక కార్యక్రమాలకే పరిమితమయ్యాడు.
దక్కన్‌ టీవీని ఆదరించండి : కోదండరామ్‌
దక్కన్‌ టీవీని తెలంగాణ ప్రజలు ఆదరించాలని టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పిలుపునిచ్చారు. లగాన్‌ సినిమాలో ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి కోసం క్రికెట్‌ ఆడేందుకు వచ్చిన వారికి ఎలగైతే ఆ ప్రాంత ప్రజలు అండగా నిలిచారో, తెలంగాణ ప్రజల ఆకాంక్షల పక్షాన ముందుకు వస్తున్న దక్కన్‌ టీవీకి తెలంగాణ ప్రజలు అండగా నిలవాలన్నారు. తెలంగాణకు వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన కట్జూను ముఖ్య అతిథిగా ఆహ్వానించి బహిష్కరించడం ద్వారా ప్రారంభానికి ముందే తన సత్తా చాటుకుందన్నారు. భారత దేశ సమాఖ్య స్వభావ దేశమని, సమాఖ్య అంటేనే ఫెడరల్‌ వ్యవస్థ అని, దానికి భిన్నంగా రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ కట్జూ వ్యాఖ్యానించడం దారుణమన్నారు. న్యాయమూర్తులు ఏదైనా కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయం ఎటువైపు ఉందో అదే తీర్పునిస్తారని, కట్జూ కేవలం ఆంధ్ర ప్రాంత ప్రజల అభిప్రాయాలనే విని తెలంగాణ ఆకాంక్షే తప్పు అనే రీతిలో మాట్లాడటం సరికాదన్నారు. ఆర్టికల్‌ 3 ప్రకారం రాష్ట్రాలను విభజించే అధికారం పార్లమెంట్‌కు ఉంటుందని, సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన కట్జూ అదే రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం వల్ల ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం సన్నగిల్లే ప్రమాద ముందన్నారు. గతంలో ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డాయని అప్పుడు దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లనప్పుడు తెలంగాణ ఏర్పాటు ద్వారానే ఎలా వాటిల్లుతుందని ప్రశ్నించారు. పౌర హక్కుల నేత ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఎన్నో చానెళ్లు పెట్టినా తర్వాతిక్రమంలో అవి వ్యాపార ధోరణిలోకి వెళ్లిపోయాయన్నారు. దక్కన్‌ టీవీ యజమాన్యం ప్రజల పక్షాన   పనిచేయాలని, వీలైనంత వరకూ రాజీపడకుండా చానెల్‌ను నిర్వహించాలని ఆకాంక్షించారు. న్యాయవ్యవస్థను గౌరవిస్తున్నాం కాబట్టి అదే గౌరవం న్యాయమూర్తులకు ఇస్తున్నామని, న్యాయమూర్తిగా చెప్పుకునే కట్జూ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం సరికాదని అభిప్రాయపడ్డారు. అంతకుముందు దక్కన్‌ టీవీ లక్ష్యాలను చీఫ్‌ ఎడిటర్‌ వాసు, సీఈవో ఎంవీ రమణ వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాగం జనార్దన్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కె. కేశవరావు, టీఎన్‌జీవోఎస్‌ అధ్యక్షుడు దేవిప్రసాద్‌, తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ నాయకుడు వేదకుమార్‌, న్యూ డెమోక్రసీ నాయకుడు గోవర్ధన్‌, గాయకుడు దేశపతి శ్రీనివాస్‌, దక్కన్‌ టీవీ సీఎండీ జహ్రుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.