కడెం ప్రాజక్ట్‌ వద్ద కొనసాగుతున్న వరద

గోదావరిలోకి నీటి విడుదల

అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి హరీష్‌ రావు

నిర్మల్‌,జూలై9(జ‌నం సాక్షి):ఎగువన కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 697.450 అడుగులుగా ఉంది. ఎగువ నుంచి 4541 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. వరద గేటు ద్వారా గోదావరిలోకి 3860 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు కింద ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కడెం ప్రాజెక్టుకు ఆదివారం ఉదయం ఏకంగా 18 వేల క్యూసెక్కుల పైచిలుకు ఇన్‌ప్లో ఉండటంతో 7.60 టీఎంసీల పూర్తిస్థాయి నిల్వసామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం సుమారు 7.009 టీఎంసీల నిల్వను అధికారులు నిర్వహిస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఇన్‌ప్లో ఏడు వేల క్యూసెక్కుల వరకు ఉండగా.. తొమ్మిది గేట్లు ఎత్తి 6259 క్యూసెక్కులను ఎల్లంపల్లి జలాశయంలోకి వదులుతున్నారు. మరోవైపు వర్షాలు ఊపందుకోవడంతో నదీ ప్రవాహాల్లో వేగం పెరిగింది. దీంతో అధికారులను మంత్రి హరీష్‌ రావు అప్రమత్తం చేశారు. జాగ్రతత్గా ఉండాలని, అవసరమైన చర్యలకు సిద్దంగా ఉండాలన్నారు. ముఖ్యంగా గోదావరి ప్రవాహం క్షణక్షణానికీ పెరుగుతున్నది. ఎగువనుంచి వస్తున్న జలాలతో గోదావరిపై ఉన్న ప్రాజెక్టుల్లోకి ఇన్‌ఫో/-లోలు పెరుగుతున్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంవద్ద 2,56,700 క్యూసెక్కుల ప్రవాహంతో గోదావరి జలాలు దిగువకు పరుగు తీస్తున్నాయి. ఇక్కడ గోదావరి 7.8 విూటర్ల లోతుతో ప్రవహిస్తున్నది. అన్నారం వద్ద 4230 క్యూసెక్కులతో గోదావరి దిగువకు పరుగులు పెడుతున్నప్పటికీ.. కాళేశ్వరం పనులు నిరంత రాయంగా కొనసాగుతుండటం విశేషం. తక్కువస్థాయి ప్రవాహం ఉన్నప్పటికీ వరద ఉధృతి ఇంకా పెరుగుతుందని కేంద్ర జలసంఘం స్పష్టంచేసింది.

ఇప్పటివరకు గోదావరి చరిత్రలో కాళేశ్వరం వద్ద 1986లో గోదావరి డేంజర్‌ జోన్‌ దాటి 107.05 విూటర్ల ఎత్తులో ప్రవహించినట్టు జలసంఘం రికార్డులు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం మేడిగడ్డవద్ద ప్రవాహం 93.68 విూటర్ల ఎత్తులో ఉంది. శ్రీరాంసాగర్‌లోకి ప్రస్తుతం 3500 క్యూసెక్కుల పైగా ఇన్‌ప్లో ఉంది. ఇక్కడినుంచి ఎల్లంపల్లికి జలాలు వచ్చే అవకాశం లేకున్నా.. కడెం నుంచి వరద వస్తుండటంతో ఎల్లంపల్లిపై ఆశలు చిగురిస్తున్నాయి.మహారాష్ట్ర మొదలు దిగువ ధవళేశ్వరం.. అటు ప్రాణహిత, ఇంద్రావతిల్లోనూ గోదావరి ప్రవాహాలు మెరుగ్గానే ఉన్నాయి. 17 చోట్ల కేంద్ర జలసంఘం ప్రవాహ కొలమాన కేంద్రాలు ఉండగా, ప్రధానంగా కాళేశ్వరం, భద్రాచలం, కూనవరం వద్ద ప్రవాహ ఉధృతి పెరుగుతున్నట్టు రికార్డుల్లో నమోదైంది. మిగిలినచోట్ల ప్రవాహం నిలకడగా కొనసాగుతున్నది. ఛత్తీస్‌గఢ్‌ అటవీప్రాంతంలో వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టులోకి 70 అడుగుల మేరకు నీరు చేరింది. ఇదే జిల్లా పాల్వంచ సవిూపంలోని కిన్నెరసాని ప్రాజెక్టులో నీటిమట్టం 397.7 అడుగులకు చేరింది. కృష్ణానదిలో ఇన్‌ఎ/-లోలు నిలకడగా కొనసాగుతున్నాయి. ఆల్మట్టికి 32,380 క్యూసెక్కులు, తుంగభద్రకు 7661 క్యూసెక్కుల ఇన్‌ఎ/-లో నమోదవుతున్నది. ఆల్మట్టిలో ప్రస్తుతం 20.56 టీఎంసీల నీటి నిల్వ ఉంది. అందులో మరో 86.60 టీఎంసీలతోపాటు దిగువన నారాయణపూర్‌లో ఇంకో 14 టీఎంసీల వరకు నిల్వ పెరిగితే తప్ప కర్ణాటక కృష్ణమ్మను దిగువకు వదిలే అవకాశాల్లేవు. వర్షాలకు పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మిస్తున్న సుందిళ్ల బరాజ్‌ వద్దకు వర్షపు నీరు చేరుకున్నది. దీంతో పనులకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. మంథని వైపు గోదావరి తీరం వద్ద గేట్ల నిర్మాణాలు, బరాజ్‌ సీసీ నిర్మాణాలు పూర్తికావడంతో బరాజ్‌ అవతలి ఒడ్డు మంచిర్యాల జిల్లా కుందారం వైపు వరద నీరు వచ్చి చేరింది. సిరిపురం వైపు వర్షం కురిసినంత సేపు పనులను నిలిపివేసి, తర్వాత యథావిథాగా కొనసాగించారు. వర్షపు నీరు త్వరగానే భూమిలోకి ఇంకిపోతున్నదని, పనులకు ఏ మాత్రం ఆటంకం ఉండబోదని కాళేశ్వరం సీఈ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు.మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలోనూ విస్తారంగా వర్షాలు కురవడం, రానున్న మూడు, నాలుగు రోజుల్లోనూ భారీ వర్షాలు నమోదవుతాయనే సమాచారంతో నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మహారాష్ట్ర, భైంసాల్లో భారీ వర్షాలతో చిన్న సుధ ప్రాజెక్టు పరిధిలోని బొడేగావ్‌ గ్రామం వరద నీటిలో చిక్కుకుంది. మంత్రికి ఆ సమాచారం వచ్చిన వెంటనే పునరావాస చర్యలు తీసుకోవాల్సిందిగా నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని వాట్సాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని, అత్యవసరమైతే వెంటనే సమాచారం ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించడంతో ఆయా ప్రాజెక్టు అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

తాజావార్తలు