కడెం రైతుల్లో ఆందోళన
ఆదిలాబాద్,జూలై2(జనం సాక్షి): కడెం ప్రాజెక్టులో ప్రస్తుతం నీటిమట్టం గతేడాదితో పోలిస్తే భారీగా తగ్గింది. దీంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన మొదలయ్యింది. అయితే నీరు చేరితే విడతల వారీగా విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని స్థానిక ప్రజాప్రతినిధులు వెల్లడించారు. వర్షాల ప్రభావంతో మరింత ఇన్‌ఫ్లో వచ్చి చేరితే గోదావరిలోకి నీటిని విడుదల చేసే ముందు ఆ నీటిని కుడి, ఎడమ కాలువల ద్వారా విడుదలచేస్తామని అన్నారు. జలాశయం చివరి ఆయకట్టు వరకూ నీటిని అందించేది, లేనిది నీటిమట్టం పూర్తి స్థాయిలో చేరితే తిరిగి రైతులతో సమావేశం నిర్వహించి తీర్మానించనున్నట్లు తెలిపారు. రైతులు ఆధైర్య పడోద్దని, ప్రస్తుతం భారీ వర్షాలు లేకా, నీటిమట్టం పూర్తిస్థాయికి చేరలేదనే విషయాన్ని గమనించాలన్నారు. పూర్తిస్థాయిలో 695 అడుగులకు చేరితేనే కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తామని ఎమ్మెల్యేలు అజ్మీర రేఖానాయక్ అన్నారు. అధికారులు, రైతులు, డిస్టిబ్యూట్రరీ సంఘాల నాయకులు, నీటి సంఘాల చైర్మన్లతో చర్చించారు. అధికారులు సైతం ఇన్‌ఫ్లోను జాగ్రత్తగా కాపాడుతూ, పంటల కోసం ఉపయోగ పడేలా చూడాలన్నారు. ఆయకట్టు పరిధిలో అనేక మంది రైతులు ఉన్నారని, రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర సర్కారు భారీగా నిధులు విడుదల చేస్తూ, సాగును ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. రైతులకు రుణాలు, పెట్టుబడి సాయంతో పాటు, సాగునీటిని అందించేందుకు నూతన ప్రాజెక్టులు, ఆయకట్టు పరిధిలోని కాలువల ఆధునీకరణ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. గోదావరి నదిపై కొత్తగా చెక్‌డ్యాంల నిర్మాణానికి నిధులు విడుదల చేయడం తో పాటు, కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కుప్టి వద్ద మరో ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్న ట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు కడెం ప్రాజెక్టుకు బాలెన్సింగ్ రిజర్వాయర్‌గా ఉపయోగపడుతుందని చెప్పారు.
——-