కదిలిన లోకాయుక్త శ్రీ అవినీతి మంత్రులకు మొదలైన గుబులు

శ్రీమొదటి విడతలో రఘువీరాకు తాఖీదు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 13 :

రాష్ట్రానికి వన్నె తెచ్చేలా ఏపీ లోకాయుక్తను నిర్వహిస్తానని ప్రమాణం చేసిన మరుసటి రోజే జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి కొరడా ఝుళిపించారు. లోకాయుక్త మొదటి లక్ష్యం అవినీతి మంత్రులేనని ఆయన చెప్పకనే చెప్పారు. మొదటి విడతగా సుభాషణ్‌రెడ్డి నేతృత్వంలో లోకాయుక్త మంత్రి రఘువీరాకు తాఖీదు పంపింది. శేరిలింగంపల్లి మాజీ తహసిల్దార్‌ సుబ్బారావు అవినీతి వ్యవహారంలో లోకాయుక్త రఘువీరారెడ్డికి ఈ నోటీసు జారీ చేసింది. మంత్రితోపాటు రెవెన్యూ శాఖ కార్యదర్శి పునీత్‌, అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు కూడా  తాఖీదులు పంపింది. అటు సుబ్బారావుకు నోటీసులు పంపింది. శేరిలింగంపల్లిలోని విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తికి అప్పగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధించి సుబ్బారావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనందుకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. భూమి బదిలీ వ్యవహారంలో అప్పటి కలెక్టర్‌ విచారణ చేపట్టి సుబ్బారావును రెవెన్యూ శాఖకు సరెండర్‌ చేసినా తన పలుకుబడితో పోస్టింగ్‌ తెచ్చుకోవడం వెనుక మంత్రి రఘువీరా హస్తం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. సుబ్బారావు జారీ చేసిన ఉత్తర్వులు హై కోర్ట ఆదేశాల మేరకు రద్దయినా, అతనిపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ లోకాయుక్త నోటీసులు జారీ చేసింది.