కనీసం ఒక్కడైనా చావాలి

తుత్తుకూడి కాల్పులకు పోలీస్‌ అధికారి ప్రేలాపన
వైరల్‌గా మారిన వీడియో
చెన్నై,మే23( జ‌నం సాక్షి): ‘కనీసం ఒక్కరైనా చావాలి’.. ఇదీ స్టెరిలైట్‌ కాల్పుల ఘటన సందర్భంగా మప్టీలోని ఓ పోలీస్‌ అధికారి తన సహచరులను ఉత్సాహపర్చేందుకు అరిచిన అరుపు. ఇప్పడు దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ సోషల్‌ విూడియాలో వైరల్‌ కావడంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.తమిళనాడులోని తూత్తుకుడిలోని స్టెరిలైట్‌ రాగి కర్మాగారాన్ని మూసివేయాలని ప్రజలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పదకొండు మంది మృత్యువాతపడ్డారు. కొన్నేళ్లుగా ఈ ఫ్యాక్టరీని మూసివేయాలని స్థానికులు ఆందోళనలు చేపడుతున్నారు. ఈనేపథ్యంలో మంగళవారం ఆందోళనలు మిన్నంటాయి. దాంతో పోలీసులు కాల్పులు జరపడంతో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు క్షతగాత్రులు స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆందోళనకారులను బెదిరించడానికి గాల్లోకి కాల్పులు జరపకుండా ఆందోళనకారుల వైపు గురిపెట్టడం విమర్శలకు తావిస్తోంది. అయితే పోలీసులు కాల్పులు జరుపుతున్నప్పుడు సాధారణ దుస్తుల్లో ఉన్న ఓ పోలీసు అధికారి..అక్కడే ఉన్న ఓ బస్సు ఎక్కి ‘కనీసం ఒక్కరైనా చావాలి’ అని అరవడం వివాదాస్పదంగా మారింది. మరోపక్క అక్కడే ఉన్న పోలీసులు బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు వేసుకుని ప్రజలపై కాల్పులు జరుపుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో అధికారి బస్సుపై పడుకుని మరీ కాల్పులు జరిపేందుకు యత్నించారు. ఆ సందర్భంలో అక్కడి విూడియా వర్గాలు రికార్డు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌విూడియాలో వైరల్‌గా మారింది.