కనీస వేతనాలు అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి

ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు

ఇటిక్యాల (జనంసాక్షి) జులై 24 : గ్రామ పంచాయతీ కార్మికులకు లేబర్ చట్టం ప్రకారం రోజుకు ఎనిమిది గంటల పనిని అమలు చేసి జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండల పరిధిలోని జింకలపల్లి పొగాకు కంపెనీ దగ్గర గ్రామ పంచాయతీ కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడంలేదని చాలా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు కార్మికులను భయభ్రాంతులకు గురిచేసి 24 గంటలు గొడ్డు చాకిరి చేస్తున్నారని విమర్శించారు. రాజరికం నాటి చట్టాలను నేడు అమలు చేయడం సిగ్గుచేటు అన్నారు. ఇంత జరుగుతున్న ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారని సూటిగా నిలదీశారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి తక్షణమే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి నరసింహులు, జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణ, ఏఐటీయూసీ నాయకులు సత్యరాజ్, కార్మికులు ఎర్రన్న, సహదేవుడు, తిరుపాలు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు