కన్నయ్య నినాదాలు చేయలేదు
– శత్రుఘ్ఞ సిన్హా
న్యూఢిల్లీ,ఫిబ్రవరి 17(జనంసాక్షి): అఫ్జల్ గురు సంస్మరణ సభతో జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో తలెత్తిన వివాదం, అనంతర పరిణామాలపై బిజెపి ఎంపి శత్రుఘ్న సిన్హా తనదైన శైలిలో స్పందించారు. పార్టీని ఇరుకున పెడుతున్న సిన్హా ఈవిషయంలోనూ విపక్షాల గొంతుకనే వినిపించారు. అంతేగాకుండా సొంత పార్టీ బీజేపీకి చురకలంటించారు. జేఎన్‌యూ ఉదంతంలో దేశద్రోహం కేసు కింద అరెస్టయిన విద్యార్థి సంఘం నాయకుడు కన్నయా కుమార్ ను విడుదలచేయాలని డిమాండ్ చేశారు. ఆ కార్యక్రమంలో కన్నాయా కుమార్ స్పీచ్ ఆసాంతం విన్నాను. మా బీహార్ కు చెందిన ఆ యువ నాయకుడు ఏక్కడ కూడా జాతివ్యతిరేక నినాదాలు చేసినట్లు నాకనిపించలేదు.ఈ విషయంలో మా పార్టీకి చెందిన కొంరు నాయకులు అతిగా స్పందించారు అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో బీజేపీ త్వరలోనే తన విధానాన్ని మార్చుకుంటుందని ఆశిస్తున్నానన్నారు. జేఎన్ యూ అంతర్జాతీయ ఖ్యాతి గడిచిన విద్యాసంస్థ అని, ఎందరో అత్యుత్తమ విద్యార్థులు, టీచర్లున్న ఆ సంస్థలో ఇక ముందు సంకటస్థితి నెలకొనకుండా బీజేపీ నేతలు వివాదాన్ని ఇంతటితో ముగించాలని శత్రుఘ్న హితవుపలికారు. వాళ్లు మన సొంత పిల్లలు. జీవితాలపై ప్రభావం చూపే కేసులు బనాయించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తరచూ పార్టీ వ్యతిరేక ప్రకటనలుచేసే శత్రుఘ్నా సిన్హా ఇటీవలే అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలన్న కేంద్రం నిర్ణయాన్ని తప్పుపట్టిన సంగతి తెలిసిందే. జెఎన్ యు ఘటనపై కేంద్ర ¬ం మంత్రి రాజ్ నాద్ సింగ్ తీవ్రంగా స్పందించితే,అదేపార్టీకి చెందిన ఎమ్.పి శత్రుఘ్న సిన్హా మాత్రం బీహారు యువకుడిపై దేశద్రోహం కేసు పెడతారా అని మండిపడ్డారు.
ఇదిలావుంటే పటియాల హౌస్ న్యాయస్థానం వద్ద మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దేశద్రోహం కేసులో అరెస్టయిన జేఎన్‌యూ విద్యార్థి నేత కన్నయ్యకుమార్ న్యాయస్థానంలో విచారణకు తీసుకొచ్చిన సందర్భంగా న్యాయవాదులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగింది. వాగ్వాదం శ్రుతిమించి ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. మరోవైపు న్యాయవాదులు రెండు వర్గాలుగా విడిపోయి కోర్టు ప్రాంగణంలోనే పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ ఘటనలతో న్యాయస్థానం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.