కన్హయకు మద్ధతుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు

3

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 19(జనంసాక్షి): జేఎన్‌యూ విద్యార్థినేత కన్హయకు మద్ధతుగా దేశవ్యాప్తంగా ఆందోనలను మిన్నంటాయి. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ర్యాలీలు నిర్వహించారు. కన్హయకు మద్దతు కాశ్మీర్‌ వరకు పాకింది. కాశ్మీర్‌లో పలువురు ఆందోళనలు చేశారు. దేశంలో పలు యూనివర్సిటీలు కన్హయకు మద్ధతుగా ఆందోళనలు కొనసాగిస్తున్నాయి.’కన్నయ్య నీతో మేమున్నాం. నీ పోరాటం కొనసాగించు’ అంటూ విద్యార్థి లోకం నినదించింది. ‘రోహిత్‌ హంతకులు.. మాకు దేశభక్తి నేర్పుతారా?’ అంటూ ప్రశ్నించింది. ‘ఒక కన్నయ్య గొంతునొక్కితే పదివేల కన్నయ్యల గొంతుకగా నిలుస్తామని’ చాటింది. ‘మనువాదం, సాంప్రదాయవాదం, మతోన్మాదం, ఫాసిస్టు చర్యలను నిరసిస్తూ.. దేశం మొత్తం వినబడేలా మరోసారి స్వాతంత్య్రం కోరింది. ‘నిరాధార’ ఆరోపణలతో అరెస్టు చేసిన కన్నయ్యకుమార్‌ను వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్‌ చేసింది. విద్యార్థిలోకానికి సీపీఐ, సీపీఐ(ఎం), ఇతర రాజకీయ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. దేశద్రోహం ఆరోపణలపై అరెస్టు చేసిన కన్నయ్యకుమార్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ వామపక్ష, ప్రజాతంత్ర విద్యార్థి సంఘాలు ఢిల్లీలో గురువారం చేపట్టిన ర్యాలీకి విద్యార్థులు పెద్ద ఎత్తున తరలొచ్చారు. విద్యార్థులకు మద్దతుగా ఢిల్లీవాసులు, న్యాయవాదులు, మేధావులు, అధ్యాపకులు, ప్రజాస్వామికవాదులు కలిసి నడిచారు. మండిహౌస్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ జంతరమంతర్‌ వద్ద శాంతియుతంగా ముగిసింది. ఈ ర్యాలీలో జేఎన్‌యూ నుండే కాకుండ దేశంలోని వివిధ యూనివర్సిటీల నుంచి వేల సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. మొదట మండిహౌస్‌ వద్ద విద్యార్థుల ప్రదర్శన నిర్వహించారు. జాతీయ జెండాలు చేతపట్టుకుని విద్యార్థులు ర్యాలీ అగ్రభాగాన నిలిచారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, మనువాదానికి వ్యతిరేకంగా విద్యార్థులు పెద్దపెట్టున నినదించారు. ర్యాలీలో సీపీఐ, సీపీఐ(ఎం) నేతలు పాల్గొని ప్రసంగించారు. మొదట సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడారు. కేంద్రంలోని మోడీ సర్కారు పెద్దలు జేఎన్‌యూ విద్యార్థులందరినీ జాతివ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. జేఎన్‌యూ గతంలో ఎమర్జెన్సీ సమయంలోనూ భావ ప్రకటన స్వేచ్ఛ ఔన్నత్యాన్ని కాపాడిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజ్యాంగంప???,చట్టంపై విశ్వాసం లేని వారే జర్నలిస్టులపై, విద్యార్థులపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. ఈ ర్యాలీలో అలీఘడ్‌ జామియా ఇస్లామియా, ఎఫ్‌టీఐఐ, హెచ్‌సీయూ, అలహాబాద్‌ తదితర యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌, లోక్‌సభ ఎంపీ మహమ్మద్‌ సలీం, ఎంబి రాజేష్‌, ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి జగమతి సంగ్వాన్‌, ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి విక్రం సింగ్‌, సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా, నారాయణ, అమర్జీత్‌కౌర్‌, ఎఐఎస్‌ఎఫ్‌ జాతీయ నాయకులు వలీ ఉల్లాఖాద్రీ, ఢిల్లీయూనివర్సిటీ అధ్యాపకుల అసోసియేషన్‌ అధ్యక్షులు నందితా నరైన్‌, స్వరాజ్‌ అభియాన్‌ వ్యవస్థాపకులు యోగేంద్రయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

సరిహద్దులు దాటొచ్చిన సంఘీభావం

కన్నయ్యకుమార్‌కు ఇప్పటికే అంతర్జాతీయంగా ప్రముఖులు తమ మద్దతు తెలియజేయగా.. తాజాగా విదేశీ యూనివర్శిటీ విద్యార్థులు సైతం అండగా నిలిచారు. కన్నయ్యకు మద్దతుగా చేపట్టిన ర్యాలీలో నేపాల్‌ యూనివర్సిటీ, సౌత్‌ ఏషియన్‌ యూనివర్సిటీ నుంచి విద్యార్థులు పాల్గొని తమ సంఘీభావం పలికారు.

విద్యార్థినేతపై దేశద్రోహంకేసు తగదు

జెఎన్‌యు విద్యార్థి నేత కన్నయ్యకుమార్‌పై పెట్టిన దేశద్రోహం కేసును ఎత్తివేసి విడుదల చేయాలని ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. విద్యార్థినేతపై దేశద్రోహం ముద్ర వేసి విద్యార్థుల గొంతు నొక్కుతున్నారన్నారు. కన్నయ్య కుమార్‌ అరెస్టుకు ముందు అతని ప్రసంగాన్ని వింటేనే ఎవరు దేశద్రోహులో అర్థమయ్యేదన్నారు. హెచ్‌సీయూలో రోహిత్‌ ఘటనను మరుగున పనిచేందుకే జేఎన్‌యూలో దేశద్రోహం పేరుతో అక్రమ అరెస్టులు సాగిస్తున్నారన్నారు. కోర్టు ఆవరణలోనే మతోన్మాద న్యాయవాదులు విద్యార్థులు, అధ్యాపకులపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. దాడి చేసిన వారిని అరెస్టు చేసి కేసులు నమోదు చేయాలన్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్‌ సుంకం వేసి పోటీ పడి పెట్రో ధరలు పెంచుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హావిూలను నిలుపుకోవడంలేదన్నారు. ఈ సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తామని అన్నారు.  మరోవైపు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నా తగ్గించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా పాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఎం నేత  విమర్శించారు. అంటువ్యాధులు విస్తరిస్తున్న నివారించడానికి రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం చర్చిండం లేదని ఆరోపించారు.  దేశంలో ఆరున్నర దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనివిధంగా మతోన్మాద శక్తులు విజృంభిస్తున్నాయని.. సామాన్యుడు టీ వాలా అంటూ మోదీ తరఫనె ప్రచారం చేసిన భాజపా ఇప్పటి కార్పొరేట్‌ లగ్జరీ జీవితంపై ఏం సమాధానం చెబుతుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో తెరాస పాలన గత ప్రభుత్వాల పాలన మాదిరిగానే ఉందన్నారు. పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలకు చరమ గీతం పాడాలని  అన్నారు.