కన్హయ కుమార్‌కు బెయిల్‌ మంజూరు

1

న్యూఢిల్లీ,మార్చి2(జనంసాక్షి): ఢిల్లీలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జె.ఎన్‌.యు) విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ కు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. రూ. 10 వేల పూచీకత్తుతో ఆరు నెలలపాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. దీంతో, కన్నయ్య కుమార్‌ రేపు ఢిల్లీలోని తీహార్‌ జైలు నుంచి విడుదల కానున్నాడు. దేశానికి వ్యతిరేకంగా, పాకిస్థాన్‌ కు అనుకూలంగా నినాదాలు చేశారని, ఉపన్యాసం ఇచ్చారని ఆరోపిస్తూ కన్నయ్యపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయనకు కోర్టు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది.మరోవైపు, కన్నయ్య కుమార్‌ ప్రసంగం వీడియో క్లిప్పింగ్స్‌ లో దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయలేదని హైదరాబాద్‌ లోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ తేల్చింది. పైగా, వీటిలో రెండు వీడియో క్లిప్పింగుల్లో బయటి నుంచి వాయిస్‌ పోస్ట్‌ (ట్యాంపరింగ్‌) చేసినట్టు స్పష్టం చేసింది. నినాదాలు చేసినవాళ్లు కూడా ముసుగులు ధరించి ఉన్నారని చెప్పింది. ఈ మేరకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది. దీంతో, ఇది కుట్రపూరితంగా నమోదు చేసిన కేసుగా భావిస్తున్నారు.