కమలం కుదేల్‌

– ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపికి ఎదురుదెబ్బ
– నాలుగు లోక్‌స్థానాల్లో ఒక్క స్థానంలోనే గెలుపు
– 11 అసెంబ్లీ స్థానాల్లో కమలానికి షాక్‌
– రెండు స్థానాల్లోనే పాగా
– సత్తాచాటుకున్న కాంగ్రెస్‌, ప్రాంతీయ పార్టీలు
న్యూఢిల్లీ, మే31(జ‌నం సాక్షి) : ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, నాగాలాండ్‌ రాష్ట్రాల్లోని నాలుగు లోక్‌సభ స్థానాలతోపాటు దేశ వ్యాప్తంగా 11 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నిక ఫలితాలు బీజేపీకి షాక్‌ ఇచ్చాయి. నాలుగు పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేసిన బీజేపీకి కేవలం ఒక్క చోట మాత్రమే సత్తా చాటింది. రెండింటిలో దాదాపు ఓటమి అంచుకు చేరగా మరో చోట గట్టి పోటీ ఎదుర్కొని ఓటమిపాలైంది. మరోవైపు 11అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగ్గా ఒక్కచోట మాత్రమే విజయం సాధించింది. కాంగ్రెస్‌ 4 స్థానల్లో గెలుపొందింది. మిగిలిన స్థానాల్లో ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు.
లోక్‌సభ స్థానాల్లో..
దేశ వ్యాప్తంగా నాలుగు లోక్‌ సభ స్థానాల్లో బీజేపీ ఒక్క స్థానంలోనే విజయాన్ని దక్కించుకుంది. నాగాలాండ్‌ లోక్‌సభ స్థానంలో ఎన్డీపీపీ విజయం సాధించింది. పాల్ఘడ్‌(మహారాష్ట్ర)లో శివసేన అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. భండారా-గోండియా స్థానాల్లో(మహారాష్ట్ర)లో ఎన్సీపీ ఘనవిజయం సాధించింది. ఇక కైరానా(యూపీ) లోక్‌సభ నియోజకవర్గంలో ఆర్‌ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్‌ హసన్‌ 55 వేల ఓట్ల మెజార్టీతో బీజేపీ పోటీదారు మృగంకా సింగ్‌పై ఘన విజయం సాధించారు. ఇక్కడ విపక్షాలన్నీ(ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌) కలిసి ఆర్‌ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్‌ హసన్‌ను నిలబెట్టాయి.
అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే…
మొత్తం 11 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా గురువారం ఫలితాలు వెలువడ్డాయి. వీటిల్లో బీజేపీ రెండు స్థానాలతోనే సరిపెట్టుకోగా.. కాంగ్రెస్‌ నాలుగు స్థానాల్లో గెలుపొందింది.. మరోవైపు మిగిలిన స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు విజయం సాధించాయి.
– మేఘాలయలోని అంపతి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మియాని డి శిరా విజయం సాధించారు. నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ అభ్యర్థిపై 3,100సీట్ల మెజార్టీతో గెలుపొందారు.
– బీహార్‌లో ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కు ఎదురు దెబ్బ తగిలింది. జోకిహట్‌ నియోజకవర్గంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు చెందిన రాష్టీయ్ర జనతా దళ్‌(ఆర్జేడీ) అభ్యర్థి విజయం సాధించారు. ఆర్జేడీ అభ్యర్థికి 76వేల ఓట్లు పోలవగా, జేడీయూ అభ్యర్థికి 37,913ఓట్లు పోలయ్యాయి. జోకిహట్‌ నియోజకవర్గంలో జేడీయూ, ఆర్జేడీల మధ్య ప్రతిష్ఠాత్మక పోరుగా నిలవగా ఇందులో ఆర్జేడీ బలాన్ని చాటుకుంది.
– ఉత్తరప్రదేశ్‌లోని నూర్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో సమాజ్‌ వాదీ పార్టీ విజయం సాధించింది. ఎస్పీ అభ్యర్థి నయీముల్‌ హసన్‌ ప్రత్యర్థి భాజపా అభ్యర్థి అవనీష్‌ సింగ్‌పై సుమారు 10వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్‌లోని థరాలీ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్‌ స్థానంలో బీజేపీనే మరోసారి విజయం సాధించింది.
–  కేరళలోని చెన్‌గన్నూర్‌ శాసనసభ నియోజకవర్గంలో సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ విజయం
సాధించింది. ఎల్‌డీఎఫ్‌ అభ్యర్థి సాజి చెరియన్‌ 20,956ఓట్ల భారీ తేడాతో గెలుపొందారు.
– జార్ఖండ్‌లోని సిల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం) పార్టీ అభ్యర్థి సీమా దేవి మహతో విజయం సాధించారు. ఏజేఎస్‌యూ అభ్యర్థిపై దాదాపు 13500ఓట్ల మెజార్టీతో ఈ స్థానాన్ని దక్కించుకున్నారు.
–  గోమియా అసెంబ్లీ స్థానాన్ని కూడా జేఎంఎం పార్టీనే దక్కించుకుంది. జేఎంఎం అభ్యర్థి బబితా దేవి సవిూప ప్రత్యర్థి అయిన భాజపా అభ్యర్థి మాఘవ్‌లాల్‌ సింగ్‌పై 1344 ఓట్ల తేడాతో గెలుపొందారు.
– కర్ణాటకలో బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. రాజరాజేశ్వరీ నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మునిరత్న 41,162 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎన్నికలు ఆలస్యంగా జరిగిన ఈ స్థానంలో కాంగ్రెస్‌ నుంచి మునిరత్న పోటీచేయగా, జేడీఎస్‌ నుంచి జీహెచ్‌ రామచంద్ర, బీజేపీ నుంచి తులసి మునిరాజు గౌడ బరిలోకి దిగారు. ఇక్కడ మొత్తం 53శాతం పోలింగ్‌ నమోదవ్వగా..కౌంటింగ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి మొదటినుంచి ఆధిక్యం కనబరుస్తూ భారీ మెజారిటీతో గెలుపొందారు.
– మహారాష్ట్ర పలుస్‌ కడేగావ్‌ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది.
– పంజాబ్‌ రాష్ట్రంలోని షాకోట్‌ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ బ్యర్థి విజయం సాధించారు.
– బెంగాల్‌ రాష్ట్రంలోని మహేష్తలా నియోజకవర్గంలో టీఎంసీ అభ్యర్థి తన స్థాను చాటుకున్నారు.
—————————