కరువుపై ప్రధాని సమీక్ష

2

దిల్లీ,మే7(జనంసాక్షి): గత కొన్ని రోజులుగా నీటి రైలు విషయంలో యూపీ సర్కారు, కేంద్రానికి విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. కేంద్రం నుంచి పంపిన నీటి రైలును యూపీ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. యూపీలోని నీటికొరతపై చర్చించేందుకు ప్రధానమంత్రి కార్యాలయంలో రాష్ట్ర అధికారులతో కలిసి అఖిలేశ్‌ మోదీతో సమావేశమయ్యారు.తీవ్ర నీటికొరతపై చర్చించి చర్యలు చేపట్టేందుకు యూపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోదీ లేఖ రాశారు. పీఎంవో కార్యాలయానికి రావాల్సిందిగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. ఇందులో భాగంగా యూపీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ శనివారం ప్రధానిని కలిశారు. అయితే ప్రధాని, సీఎంల సమావేశం వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. కరవు పరిస్థితులపై శాశ్వత చర్యలు చేపట్టేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నప్పటికీ.. యూపీ ప్రభుత్వం విముఖత వ్యక్తం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.