కరువు ప్రాంత చెరువుల్లోకి గోదావరి జలాలు

జనగామ,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): కరువు ప్రాంతాలను ఆదుకునేందుకే గోదావరి ద్వారా ఎత్తిపోతల పథకాలకు సిఎం కెసిర్‌ ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అన్నారు.గోదావరి జలాలు నిరంతరంగా రావడానికి కంతనపల్లి వద్ద బ్రిడ్జిలు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. సిఎం కెసిఆర్‌ ప్రతి చెరువునూ గోదావరి జలాలతో నింపాలని ఆదేశించినట్లు గుర్తుచేశారు. ఇలా తాము రిజర్వాయర్ల సామర్థ్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతు సమన్వయ సమితుల ద్వారా రైతుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. అలాగే యాసంగి పంటకు నీరందించి ఎకరా పడావు

ఉండకుండా సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెలే తెలిపారు. ఇదిలావుంటే స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో ఇప్పటికే ఆరు రిజర్వాయర్లు ఉన్నాయనీ, మల్కాపూర్‌లో 10.7 సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మించేందుకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేస్తారని ఎమ్మెల్యే రాజయ్య చెప్పారు.

నవాబుపేట రిజర్వాయర్‌ ద్వారా అతిత్వరలో సాగు నీరస్తామన్నారు. రైతుల సమస్యలు తీర్చేందుకే సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. టీఆర్‌ఎస్‌ కోసం శ్రమించిన, ఉద్యమించిన కార్యకర్తలకే స్థానం ఉంటుందనీ, ఈ విషయంలో ప్రతిపక్షాలు విమర్శలు మాని ప్రభుత్వానికి సలహాలు, సూచనలివ్వాలని కోరారు. అన్నదాతలే తమ పంటల ధర నిర్ణయించాలనీ, అందుకే ప్రభుత్వం రైతు సమన్వయ కమిటీలు వేస్తోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అన్నం పెట్టే రైతన్నలకు నిరంతరం పంటలకు నీరు అందించేందుకు 24 గం టల విద్యుత్‌ అందిస్తున్నామని చెప్పారు. 80 ఏళ్ల క్రితం భూ సర్వే చేశారనీ, తెలంగాణ సాధించుకున్నాక సీఎం కేసీఆర్‌ మళ్లీ భూ సర్వే చేయిస్తున్నారని గుర్తుచేశారు. ఇక రెవెన్యూ కార్యాలయాల చుటూ రైతులు తిరగాల్సిన పనిలేదన్నారు. తెలంగాణ వస్తే కరెంట్‌, నీళ్లు రావని అప్పటి పాలకులు ప్రజలను తప్పుదోవ పట్టించారని గుర్తుచేశారు. తెలంగాణ సాధించాక రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్‌ ఇస్తున్నామని అన్నారు.