కరువు సాయం అందించండి

5

– నేడు డిల్లీకి సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,మే8(జనంసాక్షి):ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రాత్రి 8:55 గంటలకు ఎయిర్‌ ఇండియా 127 హైదరాబాద్‌ -చికాగో అంతర్జాతీయ విమానంలో ఆయన ఢిల్లీ చేరుకుంటారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంట్‌ సౌత్‌ బ్లాక్‌ లో ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం కేసీఆర్‌ భేటీ అవుతారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ కార్యక్రమాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగే అవకాశాలున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌ ద్వారా అందిన కరవు సాయం వినియోగంపై కూడా ప్రధాని సమాచారం సేకరించే అవకాశాలు ఉన్నాయి. రబీ, ఖరీఫ్‌ సీజన్ల పై కూడా ఇరువురు దృష్టి సారించనున్నారు. వ్యవసాయ రంగంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి, కరవుపై ఉమ్మడి పోరుకు కార్యాచరణపై సీఎం, పీఎంలు ఫోకస్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.అదే రోజు సాయంత్రం 4:30 గం.లకు ప్రధాని దేశంలోని 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా భేటీ కానున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, ఒరిస్సా, ఛత్తీస్‌ ఘడ్‌, మహారాష్ట్ర, బీహార్‌, జమ్మూ కాశ్మీర్‌ తదితర రాష్ట్రాల ఛీఫ్‌ మినిస్టర్లు ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నెలకొని ఉన్న కరవు పరిస్థితులు, కరువుపై యుద్ధం చేయడానికి రాష్ట్రాలతోపాటు కేంద్రం భాగస్వామ్యం కూడా ఉండేలా ఒక ఉమ్మడి ప్రణాళిక రూపొందించటం, రాష్ట్రాల సంసిద్ధతతో పాటు రాబోయే మాన్‌ సూన్‌ లో అవలంభించాల్సిన విధానం తదితర అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రుల సదస్సు దృష్టి సారించబోతోంది.రాబోయే వర్షాకాలంలో భూగర్భ జలాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, నీటిని ఆదా చేసేందుకు అనుసరించాల్సిన విధానం, వచ్చే సీజన్‌ లో సాగు కోసం రైతులు పాటించాల్సిన పద్ధతులు, డ్రిప్‌, స్ప్రింక్లర్ల ద్వారా పంట పొలాలకు నీళ్లందించడం లాంటి విషయాలపై ప్రధాని దృష్టి సారించే అవకాశాలున్నాయి.సీఎం ఢిల్లీ పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో కరవు పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ ఇవాళ సాయంత్రం 4 గంటలకు సచివాలయం సీ బ్లాక్‌ లో అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితులపై ఆయన ఓ నివేదికను తయారు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు అందించారు.సీఎం కేసీఆర్‌ బుధవారం సాయంత్రం తిరిగి హైదరాబాద్‌ కు చేరుకుంటారు.