కరెంటివ్వని చంద్రబాబు తెలంగాణలో ఎట్ల పర్యటిస్తవ్
తెలంగాణ ఎమ్మెల్యే ఎరబ్రెల్లి గులాంగిరీపై హరీష్ ఫైర్
హైదరాబాద్, ఫిబ్రవరి6(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మోసం వల్లే తెలంగాణకు కరెంటు కష్టాలు వచ్చాయని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. విద్యుత్ ఇవ్వాలని చంద్రబాబును భిక్షం అడుక్కోవాలా? అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బాబు పర్యటనకు అర్థంలేదన్నారు. బాబును వరంగల్‌కు ఆహ్వానిస్తున్న ఎరబ్రెల్లిని హరీశ్‌రావు తప్పుబట్టారు. బాబు ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో పర్యటిస్తారని నిలదీశారు. బాబు ఇక్కడికి వచ్చి తెలంగాణను రాకుండా గతంలో కుట్రలు చేశానని చెప్తాడా, కరెంఠు ఇవ్వకుండా తెలంగాణ రైతులను ఇబ్బంది పెడుతున్నానని చెప్తాడా, లేకుంటే తెలంగాణకు రావాల్సిన కృష్ణా నీళ్లను రాకుండా కుట్రలు చేస్తున్నానని చెప్తాడా అని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రంలో నూతన ఇసుక పాలసీ తీసుకొస్తామని తెలంగాణ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఇసుక మాఫీయా నియంత్రణపై గురువారం గనుల శాఖ అధికారులతో మంత్రి హరీష్ సవిూక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం హరీష్‌రావు మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో ఇసుక అమ్మకాలు చేపడతామని, మార్కెట్ ధర కంటే 50 శాతం తక్కువకే ఇసుక అందిస్తామన్నారు. ఇసుక లారీల వల్ల జరిగే ప్రమాదాలను నివారిస్తామని, ఓవర్‌లోడును నిరోధించి రోడ్లను కాపాడుతామని హరీశ్ రావు పేర్కొన్నారు. మహబూబ్ నగర్ ఇసుక మాఫీయాపై జిల్లా కలెక్టర్ నివేదిక అందగానే చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఇసుక దళారులు, మాఫియాను అరికడతామన్నారు. ఇసుక సీనరేజీ స్థానిక సంస్థలకే చెందేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అదేవిధంగా పట్టా భూముల నుంచి రెండు నెలల వరకే ఇసుక తవ్వకాలకు అనుమతి ఉంటుందన్నారు.