కరెంటు ఇవ్వని బాబు పర్యటనపై భగ్గుమంటున్న తెలంగాణ

4

అడుగడుగునా తెలంగాణను అడ్డుకున్నవ్‌

ఆంధ్ర బాబుకు తెలంగాణలో ఏంపని?

కరెంటుపై స్పష్టమైన ప్రకటన చేసి బాబు పర్యటించాలి

తెలంగాణవాదుల డిమాండ్‌

తెలంగాణకు అడుగడుగునా ద్రోహం తలపెడుతున్న చంద్రబాబునాయుడు పర్యటనపై తెలంగాణ భగ్గుమంటున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడుగడుగునా అడ్డుకునే యత్నంచేసిన బాబుకు తెలంగాణలో ఏం పనని ప్రశ్నిస్తున్నరు. తెలంగాణకు విభజన చట్టం ప్రకారం రావాల్సిన కరెంటు ఇవ్వకుండా ఇబ్బందులపాలు జేస్తున్న బాబు వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తున్నరు. లేకుంటే తెలంగాణలో అడుగుపెట్టనివ్వమని హెచ్చరిస్తున్నరు.

హైదరాబాద్‌, ఫిబ్రవరి8(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వరంగల్‌ జిల్లా పర్యటన ఖరారయ్యిందని పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఫిబ్రవరి 12న వరంగల్‌ జిల్లా పార్టీ కార్యకర్తల సమావేశంలో బాబు పాల్గొంటారు. బాబు తెలంగాణలో పర్యటించి నెలలు గడిచింది. దాదాపు 8నెలల తర్వాత బాబు తెలంగాణ పర్యటనకు వస్తున్నరు. ఈ పర్యటనకు తెలంగాణ అన్ని జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో వరంగల్‌కు అడుగడుగునా కార్యకర్తల రక్షణలో బాబు చంద్రదండుతో సహా తరలివెళ్లనున్నరు. కార్యకర్తల కార్ల, బైక్‌ల ర్యాలీ నడుమ వరంగల్‌పై దండయాత్రకు సిద్ధమైనట్లు ఇప్పటికే స్పష్టమవుతోంది.

అయితే బాబు పర్యటనకు అర్థంలేదని తెలంగాణ ప్రభుత్వాధినేతలు సహా యావత్‌ తెలంగాణ సమాజం విమర్శిస్తోంది. సగటు తెలంగాణ బిడ్డ బాబు పర్యటనను వ్యతిరేకించటానికి కారణాలు అనేకం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన సుదీర్ఘ పోరాటం అనంతరం డిసెంబర్‌ 9, 2009 రోజు అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం తెలంగాణపై చేసిన ప్రకటనను బాబు ఖండించిన తీరు తెలంగాణ ఉద్యమకారులు ఎన్నటికీ మరిచిపోరు. చిదంబరం ప్రకటన చేసిన తెల్లారి సూర్యుడు పొడవకమునుపే బాబు చేసిన ఖండన ప్రకటన తెలంగాణ ఉద్యమకారుల గుండెల్ని ఖండఖండాలు చేసిన సంఘటన ఎవరు మరిచిపోలేదు. నాడు తమిళనాడులో ఉండే చిదంబరం తెలుగు రాష్ట్రాన్ని రాత్రికిరాత్రే ఎలా విభజిస్తడన్నడు బాబు. అది ఆనక మలిదశ ఉద్యమ ఉదృతికి తట్టుకోలేక అయిష్టంగనే తెలంగాణకు అనుకూలంగా సొంతపార్టీల తీర్మాణం జేసి కేంద్రానికి లేఖ ఇచ్చిండు. నాది రెండు కండ్ల సిద్ధాంతమన్నడు కానీ ఉద్యమంలో ఎందరో అమరవీరులు అసువులుబాస్తే ఒక్కరి కుటుంబాన్ని కూడా పరామర్శించిన పాపానపోలేదు. ఇగ అంచెలంచెలుగా ఎదిగిన తెలంగాణ ఉద్యమానికి తలవంచిన కాంగ్రెస్‌ సారధ్యంలోని యూపీఎ సర్కారు దిగొచ్చి జూలై 30, 2013న తెలంగాణ ప్రకటన జేస్తే.. దాన్ని వ్యతిరేకిస్తూ సమన్యాయం అనుకుంట హాస్తినలో ఆమరణ దీక్షకు కూసుండి చివరిదాకా అడ్డుకునే కుట్ర జేసిండు బాబు. సమన్యాయం అంటే ఏందని అడిగితే.. అడిగినోన్నల్ల నీకెంత మంది పిల్లలన్నడు. రెండుకళ్ల సిద్ధాంతం నుంచి ఇద్దరు పిల్లల సిద్దాంతం అందుకున్నడు. తెలంగాణ ఏర్పాటుకు జాతీయస్థాయిలో పార్టీలన్నీ ఏకమైనా.. బాబు మాత్రం తన అనుచర ఎంపీలతో పార్లమెంటులో అడుగడుగునా అడ్డంకులు సృష్టించేందుకు కుట్రలు పన్నిండు. కానీ బాబు కుట్రలు ధర్మపోరాటం ముందర నిలవలేక పటాపంచెలయినయి. చివరకు జూన్‌2, 2014న తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. స్వపరిపాలన కోసం పోరాడిన తెలంగాణలో కొత్త సర్కారు ఏర్పడ్డది. అయితే తెలంగాణపైన బాబు జేసిన కుట్రలు ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యేటందుకు కారణభూతమైనయి. ఇక ఎవరిదారి వారు చూసుకుంటరని, విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటరని తెలంగాణ అంతా అనుకున్నరు.

కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు విడిపోయినా బాబు కుట్రల పర్వం మాత్రం ఆగలేదు. బోర్లపైనే ఆధారపడి అధికంగా పంటలు పండించే తెలంగాణ రైతాంగం కరెంటు కష్టాల్లో కూరుకుంటే, తెలంగాణకు రావాల్సిన వాటా కరెంటును ఇవ్వకుండా బాబు కుట్రలు చేసిండు. ఇంకా చేస్తునే ఉన్నడు. తెలంగాణల రైతుల ఆత్మహత్యలకు కారణమైతున్నడు. పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ మార్చాలని తెలంగాణ బిడ్డలు కోరితే వ్యతిరేకించి, కేంద్రంలో భాగం పంచుకుంటున్న సర్కారుతో కుమ్మక్కై అడ్డగోలుగా పోలవరం ముంపు మండలాలను ఆర్డినెన్సుతోని ఆంధ్రల కలుపుకున్నడు. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటాను అడ్డుకునేందుకు కేంద్రానికి లేఖలు రాస్తున్నడు. కృష్ణా ట్రిబ్యునల్‌ తీర్పులకు కొర్రీలు పెడుతున్నడు. చివరకు కార్మికశాఖకు చెందిన కోట్ల రూపాయల నిధులను కూడా రాత్రికిరాత్రే అక్రమంగా విజయవాడకు తరలించుకెళ్లిన ఘనమైన చరిత్ర బాబు సర్కారుదే. చివరకు నిన్నగాత మొన్న హైదరాబాద్‌ నుంచి పరిపాలన చేస్తుంటే విదేశంలో ఉన్నట్లనిపిస్తున్నదని ఏపీ ఉద్యోగ సంఘాల నేతలతోని చెప్పి బాబు తన అసలు రంగు బయటపెట్టిండు.

బాబు కుట్రలను తెలంగాణ సమాజం ఎప్పటికప్పుడు గమనిస్తునే ఉన్నది. అందుకే తెలంగాణకు నువ్వెందుకొస్తున్నవు బాబూ అని  తెలంగాణ బిడ్డలు ప్రశ్నిస్తున్నరు. తెెలంగాణ మంత్రి హరీష్‌రావు బాబు పర్యనపై ఘాటుగనే స్పందించిన్రు. ”బాబూ.. తెలంగాణకు వచ్చి ఎం చెప్తవ్‌.. కరెంటు రాకుండా కుట్రలు చేసిన్నని చెప్తవా, పోలవరం విషయంలో ద్రోహం చేశానని చెప్తవా, హైదరాబాద్‌లో ఉంటే పరాయి దేశంలో ఉన్నట్లుందని చెప్తవా, ఏమని చెప్తవో.. చెప్పినంకనే తెలంగాణలో పర్యటించాల్నన్నరు”. బాబు అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ మాణిక్యమైన నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని విక్రయించావన్నరు. తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీసేందుకు, అభివృద్ధిని అడ్డుకునేందుకు కరెంటివ్వకుండా, పరిశ్రమలు రాకుండా పన్నాగం పన్నిండని హరీష్‌రావు అన్నరు.

బాబు తెలంగాణలో తలపెట్టిన పర్యటనను విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నయి. చంద్రబాబు రక్తంలోనే తెలంగాణపై విషం చిమ్మే కుట్ర ఉందని, హైదరాబాద్‌ను విదేశమంటున్న బాబు ఇక్కడ పర్యటిస్తే తగిన బుద్ది చెప్తామని హెచ్చరిస్తున్నరు. వరంగల్‌కు వస్తే బాబుపై మహబూబాబాద్‌ తరహాలో రాళ్లదాడి తప్పదని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి. తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు బాబుకు లేదని, బాబు పర్యటన మానుకోవాలని డిమాండ్‌ చేస్తున్నరు. ఇప్పటికే హైదరాబాద్‌ను విదేశమన్న బాబుపై కేసు పెట్టాలని వచ్చిన పిటిషన్‌లపై స్పందించిన కోర్టులు చంద్రబాబుపై కేసులు పెట్టాలని పోలీసులను ఆదేశించాయి. ఓయూ జేఏసీ ప్రతినిధులు సైతం బాబుపై కేసు పెట్టాలంటూ ఓయూ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన్రు. ఉద్యమ సమయంలో హైదరాబాద్‌ను రెండో రాజధాని చేయాలని కుట్ర చేసిన బాబు ఇప్పుడు అదేతరహాలో హైదరాబాద్‌ను విదేశమంటూ కుట్రచేస్తున్నారని విద్యార్థిలోకం మండిపడుతోంది. హైదరాబాద్‌ రెవెన్యూ, రక్షణ విషయంలో ఏపీకి హక్కులు కావాలంటూ కేంద్రానికి లేఖలు రాస్తున్న బాబు ఏ ముఖంపెట్టుకుని తెలంగాణలో పర్యటిస్తాడని ప్రశ్నిస్తున్నరు. చివరకు ఎంసెట్‌ విషయంలోనూ కొర్రీలు పెట్టేందుకు విఫలయత్నం చేసిన బాబును ఇప్పటికైనా టీటీడీపీ నేతలు వదలాలని డిమాండ్‌ చేస్తున్నరు. తెలంగాణ ఏర్పడినా ఆంద్రదోపిడీ కొనసాగాలనే టీటీడీపీ నేతలు కోరుకుంటున్నరా?అని అడుగుతున్నరు. హైదరాబాద్‌ నగరానికి తాగునీరు రాకుండా కుట్రలు చేస్తున్న బాబు, పాలమూరు ఎత్తిపోతల పథకానికి మోకాలడ్డుతున్న బాబు, తెలంగాణ వాటా కరెంటు కోస్తున్న బాబు ఇక్కడికి వచ్చి ఏం చెప్పదలుచుకున్నడో స్పష్టంచేయాలని డిమాండ్‌ చేస్తున్నరు. బాబు తెలంగాణ వాటా కరెంటు ఇస్తున్నానని చెప్తే టీటీడీపీ ఎమ్మెల్యేలు గుడ్డిగా నమ్మటం ఏంటని నిలదీస్తున్నరు. తెలంగాణపై అడుగడుగునా కుట్రలు చేస్తున్న బాబుకు గులాంగిరీ చేస్తున్న టీటీడీపీ నేతలు ఇకనైనా పార్టీ వీడాలని హితవుచెప్తున్నరు. విభజన చట్టం ప్రకారం రావాల్సిన కరెంటుపై బాబుతో స్పష్టమైన ప్రకటన చేయించి పర్యటనకు తీసుకరావాలని డిమాండ్‌ చేస్తున్నరు. బాబును నిలదీస్తే తడాఖా చూపెడతామంటున్న తెలుగు తమ్ముళ్లు తెలంగాణ బిడ్డలపై చంద్రదండుతో దాడులు చేస్తారా, దండయాత్రలకు దిగుతారా అని ప్రశ్నిస్తున్నరు. అడుగడుగునా బాబు పర్యటనను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బాబు పర్యటన ఎలా ఉండబోతుందన్నది వేచి చూడాలి.