కరోనా నుంచి కోలుకున్నాక 7నెలలపాటు యాంటీబాడీలు

స్పెయిన్‌ శాస్త్రవేత్తల అద్యయనంలో వెట్టడి
న్యూఢల్లీి,అగస్టు7(జనంసాక్షి): కరోనా బారినపడి కోలుకున్న వారిలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు ఏడు నెలల వరకు స్థిరంగా కొనసాగుతున్నట్టు తేలింది. అంతేకాదు, కొందరిలో ఇవి పెరిగినట్టు కూడా గుర్తించారు. స్పెయిన్‌లోని బార్సిలోనా ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. గతేడాది మార్చి నుంచి అక్టోబర్‌ మధ్య 578 మంది ఆరోగ్య పరిరక్షణ సిబ్బంది నుంచి నాలుగు వేర్వేరు సమయాల్లో రక్త నమూనాలు సేకరించి పరీక్షించారు. కరోనాలోని ఆరు భిన్న భాగాలపై పని చేసే ఐజీఏ, ఐజీఎం, ఐజీజీ యాంటీబాడీల స్థాయిని అంచనా వేశారు. కరోనాలోని న్యూక్లి యోక్యాప్సిడ్‌ను లక్ష్యంగా చేసుకునే ఐజీఎం, ఐజీజీ యాంటీబాడీలు మినహా మిగతా ఐజీజీ యాంటీబాడీలు ఏడు నెలలపాటు శరీరంలో స్థిరంగా కొనసాగుతున్నట్టు గుర్తించారు. సాధారణ జలుబును లక్ష్యంగా
చేసుకునే యాంటీబాడీలు కలిగున్న వారికి కొవిడ్‌ నుంచి రక్షణ లభించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వివరించారు.
కొవిడ్‌ నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరిలో యాంటీబాడీలు తయారవుతాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇవి ఎంతకాలం, ఎంతమేరకు ఆరోగ్య రక్షణ కల్పిస్తాయనే విషయంలో అయోమయం నెలకొని ఉంది. కొవిడ్‌ నుంచి కోలుకున్న కొందరిలో యాంటీబాడీలు శరవేగంతో అంతరిస్తే, మరికొందరిలో ఏకంగా ఆరు నెలల పాటు రక్షణ కల్పిస్తున్నాయి. ఇంకొందరిలో వాటి పరిమాణం పెరుగుతూ, తరుగుతూ కొనసాగడమూ జరుగుతోంది. ఇలా వీటి పరిమాణంలో హెచ్చుతగ్గులకు కారణాలను శోధించినప్పుడు, యాంటీబాడీల తీవ్రత, సామర్థ్యాలు ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత, ప్రొ ఇన్‌ప్లమేటరీ సైటోకైన్స్‌, కీమోకైన్స్‌, గ్రోత్‌ ఫ్యాక్టర్ల విూద ఆధారపడి ఉంటుందని తేలింది. సైటోకైన్‌ స్టార్మ్‌తో తీవ్రమైన కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురైన వారిలో యాంటీబాడీలు ఆరు నెలల పాటు భేషుగ్గా ఉంటాయి. అలాకాకుండా తేలికపాటి ఇన్‌ఫెక్షన్‌కు గురైనవాళ్లు లేదా ఎటువంటి లక్షణాలు బయటపడని వాళ్లలో యాంటీబాడీలు అతి తక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి. కాగా, ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలో మాత్రం.. కరోనా నుంచి కోలుకున్న వారి శరీరంలో యాంటీబాడీలు 9 నెలలపాటు యాక్టివ్‌గా ఉంటున్నాయని తేలింది. లండన్‌, ఇటలీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేశారు. మొత్తం 2వేల మందిని టెస్ట్‌ చేసి? ఈ విషయం తేల్చారు. అంటే.. ఒకసారి కరోనా సోకి రికవరీ అయిన వారు మరోసారి 9 నెలల లోపుగా కోవిడ్‌ బారిన పడినా రికవరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న మాట. అయితే కాలక్రమేణా యాంటీబాడీల పరిమాణం తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రీ ఇన్‌ఫెక్షన్‌ తిరిగి విజృంభించే ప్రమాదం ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవడం ఒక్కటే మార్గం అని వైద్య నిపుణులు అంటున్నారు.