కర్ణాటకను భాజపా అథోగతి పాల్జేసింది

అభివృద్ధి కుంటుపడింది : ప్రధాని మన్మోహన్‌
హుబ్లీ, (జనంసాక్షి) :
కర్ణాటకను భారతీయ జనతా పార్టీ అధోగతి పాల్జేసిందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నా రు. మే 5న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని సోమవారం హుబ్లీలో ప్రచారం నిర్వహించారు. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ ధ్వజమెత్తారు. దుష్పరిపాలన, అవినీతి కారణంగా కర్ణాటకలో అభివృద్ధి కుంటుపడిందని విమ ర్శించారు. బీజేపీ పాలనలో మత సామరస్యం  దెబ్బతిందని ఆరోపించారు. మైనార్టీలు అభద్రతభావంతో జీవనం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికార బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఐదేళ్ల కాలంలో బీజేపీ ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చిందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ నేతల్లో చాలా మంది అవినీతి విచారణను ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ‘దుష్పరిపాలన, అవినీతి, పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా కర్ణాటకలో అభివృద్ధి కుంటుపడింది’ అని మండిపడ్డారు. వ్యవసాయం, ఉపాధి రంగాలపై తీవ్ర నిర్లక్ష్యం చూపారని ఆరోపించారు. పెద్ద సంఖ్యలో సాగునీటి ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలిపోయాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా పనులు చేపట్టేందుకు అలసత్వం ప్రదర్శించారని విమర్శించారు. మౌలిక వసతులు కల్పించడంలో పాలకులు విఫలమైనందు వల్లే పరిశ్రమలు హైదరాబాద్‌, పుణెలకు తరలిపోయాయన్నారు. బీజేపీ హయాంలో మత సామరస్యం లోపించిందన్నారు. రాయచూర్‌, బళ్లారి, గుల్బార్గ, బీదర్‌ వంటి ప్రాంతాల్లోని మైనార్టీలు భయంతో కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి బుద్ధి చెప్పి కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు.