కర్ణాటకలో కాంగ్రెస్‌ జయభేరి

చతికిలపడ్డ భాజపా
బలపడ్డ జేడీఎస్‌
నడ్డివిరిగిన యెడ్డి
శ్రీరాములు పార్టీకి పాతర
సీఎం జగదీశ్‌ షెట్టర్‌ రాజీనామా
బెంగళూరు, మే 8 (జనంసాక్షి) :
కర్ణాటకలో కాంగ్రెస్‌ పాగా వేసింది. కమలనాథులను మట్టికరిపిస్తూ.. అధికారాన్ని హస్తగతం చేసుకుంది. సంపూర్ణ మెజార్టీని సాధించి సొంతంగా అధికారాన్ని చేపట్టింది. ప్రత్యర్థుల బలహీనతలు, అధికార పక్షం ఓట్ల చీలిక వల్ల ముఖ్యమంత్రి పీఠాన్ని సొంతం చేసుకుంది. వందకు పైగా స్థానాలు సాధించి గెలుపుబావుట ఎగురవేసింది. అవినీతి పంకిలాల్లో చిక్కుకున్న అధికార పార్టీ బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఊహించని స్థాయిలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. కనీస పోటీ కాదు కదా.. కనీసం ప్రతిపక్ష ¬దా కూడా దక్కించుకో లేకపోయింది. అనూహ్యంగా జేడీఎస్‌ అధిక స్థానాలు సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఇక కన్నడ రాజకీయాల్లో చక్రం తిప్పుతామని కలలు కన్న మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక జనతా పార్టీ అధ్యక్షుడు యడ్యూరప్ప, బీఎస్సార్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీరాములుకు కన్నడ ఓటర్లు షాకిచ్చారు. వారద్దరికి ఘోర పరాభావం తప్పలేదు. కేజేఎస్‌, బీఎస్సార్‌ పార్టీల మూలంగా బీజేపీ ఓట్లు ఘననీయంగా చీలిపోగా, ఆ మేరకు కాంగ్రెస్‌ లాభపడింది. రెండో స్థానంలో కోసం బీజేపీ, జేడీఎస్‌ మధ్య ¬రా¬రీ పోరు కొనసాగింది. మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయానికి కాంగ్రెస్‌ వంద స్థానాల్లో విజయం సాధించింది. మరో 18 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 33 స్థానాలు దక్కించుకొని, 7 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. జేడీఎస్‌ 31 నియోజవర్గాల్లో గెలుపొందగా, మరో 11 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు ముందున్నారు. కేజేపీ రెండు చోట్ల విజయం సాధించగా.. మరో ఐదు స్థానాల్లో ముందుంది. ఇతరులు 12 చోట్ల గెలుపొందగా, మరో ఐదు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
తొలి నుంచే కాంగ్రెస్‌ ఆధిపత్యం
మే 5న జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ బుధవారం జరిగింది. అందరూ ఊహించినట్లే కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టింది. వివిధ సర్వేల అంచనాలను నిజం చేస్తూ కౌంటింగ్‌ మొదలైనప్పటి నుంచే పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చింది. తొలి రౌండ్‌ నుంచే ఆ పార్టీ అభ్యర్థులు పూర్తి ఆధిక్యంలో కొనసాగారు. తొలి రౌండ్‌లోనే 112 సీట్లకు పైగా ఆధిక్యం సంపాదించిన కాంగ్రెస్‌.. చివరివరకూ దాన్ని నిలుపుకొంది. అవినీతిలో కూరుకుపోయిన అధికార పక్షం, యడ్యూరప్ప, శ్రీరాములు ఓట్లు చీల్చిన ఫలితంగా కాంగ్రెస్‌ భారీగా లాభపడింది. ఎక్కడ కూడా అధికార బీజేపీ కాంగ్రెస్‌కు సరైన రీతిలో పోటీ ఇవ్వలేక పోయింది. కౌంటింగ్‌లో వెలువడిన తొలి ఫలితంలోనే కాంగ్రెస్‌ గెలుపు విజయం సాధించింది. తొట్టతొలి ఫలితం వెలువడిన పుత్తూరు నియోజకవర్గంలో శకుంతల శెట్టి (కాంగ్రెస్‌) గెలుపొందారు. 2,672 ఓట్ల మెజార్టీతో సవిూప బీజేపీ అభ్యర్థిని మట్టికరిపించారు. బీజేపీ నుంచి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన శెట్టి పాత పార్టీ అభ్యర్థిని ఓడించారు. అటు ఉడుపిలోనూ కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రమోద్‌ మధ్వారాజ్‌ గెలిచారు.
ఊహించని రీతిలో పుంజుకున్న జేడీఎస్‌
మాజీ ప్రధాని దేవేగౌడ పట్ల కన్నడ ఓటర్లు కరుణ చూపించారు. ఆయన సొంత పార్టీ జనతాదళ్‌ (సెక్యూలర్‌) ఊహించని రీతిలో పుంజుకుంది. సర్వే అంచనాలను తారుమారు చేస్తూ అత్యధిక స్థానాలు గెలుచుకొంది. ఒకదశలో అధికార పక్షమైన బీజేపీని వెనక్కు నెట్టి రెండో స్థానం సాధించింది. దాదాపు 50 స్థానాల్లో ఆధిక్యం కనబరిచింది. ఆ సంఖ్య తర్వాత తగ్గిపోయినా ప్రతిపక్ష ¬దా దక్కించుకుంది.
యడ్యూరప్పకు ఘోర పరాభావం..
మాజీ ముఖ్యమంత్రి, కేజేపీ వ్యవస్థాపకుడు బీఎస్‌ యడ్యూరప్పకు ఊహించని రీతిలో ఓటర్లు షాకిచ్చారు. చక్రం తిప్పుతానని భావించిన ఆయన ఆశలు అడియాశలయ్యాయి. ఘోర పరాభావం చవిచూసిన ఆయన ఓట్లు చీల్చి బీజేపీని దారుణంగా దెబ్బ తీశారు. అవినీతి ఆరోపణలు రావడంతో బీజేపీ అధిష్టానం ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పించిందన్న ఏకైక కారణంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఆయన సొంత కుంపటి పెట్టుకున్నారు. బలమైన నాయకుడిగా పేరొందిన ఆయన ప్రభావం ఏపాటిదో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లోనే బయటపడింది. క్షేత్ర స్థాయిలో పార్టీ బలపడక పోవడం, పూర్తి స్థాయిలో వ్యవస్థీకృత నిర్మాణం లేకపోవడంతో యడ్డీ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లోనూ పరాజయం తప్పలేదు. అయితే, ఆయన ఎక్కువ స్థానాలు గెలుచుకోలేక పోయినా బీజేపీని మాత్రం దారుణంగా దెబ్బతీశారు.