కర్ణాటకలో మోగిన ఎన్నికల నగారా

మే 5న అసెంబ్లీ ఎన్నికలు
షెడ్యూల్‌ విడుదల చేసిన ఎన్నికల కమిషన్‌
న్యూఢిల్లీ,మార్చి20(జనంసాక్షి): కర్ణాటక శాసనసభ ఎన్నికలకు నగరా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు షెడ్యూల్‌ విడుదల చేసింది. జూన్‌ 3తో ప్రస్తుత శాసనసభ పదవీకాలం ముగియనుంది. ఏప్రిల్‌ 10న ఎన్ని కల నోటిఫికేషన్‌ వెలువడుతుంది. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు ఏప్రిల్‌ 17 కాగా, ఏప్రిల్‌ 18న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఏప్రిల్‌ 20. మే 5న కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. మే 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 224 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని, 4.18 కోట్లమంది ఓటర్లున్నారని ఈసీ తెలిపింది. ఈవీఎంల ద్వారానే ఓటింగ్‌ నిర్వహిస్తామని, 98.6 శాతం ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేశామని ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. విూడియాలో చెల్లింపు వార్తలపై నిఘా పెట్టనున్నట్లు ఈసీ పేర్కొంది. ఈ ఎన్నికలకు 50,446 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. ఒకే దఫా ఎన్నికలు జరపాలని నిర్ణయించారు. దీంతో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినట్లేనని భావిస్తున్నారు. కర్నాటకలో గత సాధారణ ఎన్నికల్లో బిజెపి అదికారంలోకి వచ్చింది. యెడ్యూరప్ప నాయకత్వంలో అధికార పగ్గాలు చేపట్టిన బిజెపి అడుగడుగునా అవాంతరాలు ఎదుర్కొంది. అవినీతి కేసులతో ఎడ్డీ దిగిపోగా బిజెపిలో ఇప్పటికే ఇద్దరు సిఎంలు మారారు. యెడ్యూరప్ప సూచించిన సదానంద గౌడ దిగిపోగా ఇప్పుడు శెట్టర్‌ సిఎంగా ఉన్నారు. పలువురు ఎమ్మెల్యేలు బిజెపి నుంచి యెడ్డీ వైపు వెళ్లారు. కర్నాటక జనతా పార్టీని యెడ్యూరప్ప స్థాపించారు. దక్షిణాదిలో ఏర్పాటైన తొలి బిజెపి ప్రభుత్వం దినదినగండం అన్నట్లు ఐదేళ్లు కొనసాగింది.