కర్ణాటకలో 69శాతం పోలింగ్‌

 బెంగళూరు, మే 5 (జనంసాక్షి) : కర్నాటకలో పోలింగ్‌ ప్రశాంతంగా ముగి సింది. ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. సుమారుగా 69 శాతం పోలింగ్‌ నమోదైనట్లు సమాచారం.  పలు ప్రాంతాల్లో స్వల్ప సంఘటనలు మినహా అంతటా ప్రశాంతంగా కొనసా గింది. హవేరిలోని ఒక పోలింగ్‌ బూత్‌లో పోలింగ్‌ అధికారిగా    విధులు నిర్వర్తిస్తున్న లీలావతి అనే ఉపాధ్యాయురాలు గుండెపోటు రావడంతో హఠాన్మరణం చెందారు. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ తొలి మూడు గంటల్లో 9శాతం మాత్రమే నమోదైంది. సాయంత్రం 4.30 గంటలకు 45శాతం..4.35 నిమిషాలకు 52.5శాతం చొప్పున పోలింగ్‌ శాతం నమోదైంది. ఇదిలా ఉండగా 224 నియోజకవర్గాలకుగాను 223 నియోజకవర్గాల్లో ఆదివారం పోలింగ్‌ కొనసాగింది. మైసూరు జిల్లాలోని ఒక నియోజకవర్గంలో బిజెపి అభ్యర్ధి మృతి చెందడంతో ఆ ప్రాంతంలో పోలింగ్‌ను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ నెల 8వ తేదీన లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానున్నది. అదేరోజు ఫలితాలు వెలువడనున్నాయి. పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్‌, జనతాదళ్‌ (ఎస్‌), కర్నాటకజనతా పార్టీ మధ్య కొనసాగినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.