కర్ణాటక-తమిళనాడు సరిహద్దులో ఘోరం
పట్టాలు తప్పిన ఎర్నాకులం ఇంటర్‌సిటీ
10 మంది మృతి, 100మందికి పైగా గాయాలు
బెంగుళూరు,ఫిబ్రవరి13(జనంసాక్షి): కర్ణాటక- తమిళనాడు సరిహద్దులో మరో రైలు దుర్ఘటన చోటు చేసుకుంది. అనేకల్ తాలూకా బిజర్‌గర్ వద్ద బెంగళూరు-ఎర్నాకుళం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.ఈ ప్రమాదంలో 10మంది మృతి చెందగా, 50 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఘటనా స్థలిలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను సవిూపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేంద్ర మంత్రి సదానందగౌడ ప్రమాద స్థలికి చేరుకుని సహాయకచర్యలు పర్యవేక్షించారు. బిజర్‌గర్ వద్ద కొండరాళ్లు విరిగిపడి రైలు పట్టాలు దెబ్బతినడంతో… సిబ్బంది మరమ్మతులు చేశారు. అదే ప్రాంతంలో ఉదయం 7.40 గంటలకు ఇంటర్ సిటీరైలు పట్టాలు తప్పింది. రెండు బోగీలు ఒకదాంట్లో మరొకటి ఇరుక్కు పోవడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. రైలు ప్రమాద ఘటనతో బెంగళూరు-ఎర్నాకుళం మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయమేర్పడింది. మృతులు కిషోర్, ముత్తమ్మ, అమన్, సెల్వరాజ్, షర్మిల, ఆంటోని, పోల్‌నీలంగా గుర్తించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు సమాచారం.అయితే ప్రమాదంలో మరో వందమందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. ఇంటర్సిటీ బెంగళూరు నుంచి ఎర్నాకులం వెళుతుండగా బెంగళూరు-తమిళనాడు సరిహద్దులోని అనేకల్ సవిూపంలో ప్రమాదానికి గురయ్యింది. .ఈ ప్రమాదంలో తొమ్మిది బోగీలు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆ-8 బోగీ పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న పోలీసులు, రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు 10 అంబులెన్‌స్‌ల్లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా బోగీల్లో చిక్కుకున్న వారిని స్థానికులు, రైల్వే సిబ్బంది… బయటకు తీసి చికిత్స నిమిత్తం తరలిస్తున్నారు. మరోవైపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడినవారిలో 23మంది పరిస్థితి విషమంగా ఉంది. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశారు.