కర్ణాటక స్పీకర్‌గా రమేశ్‌కుమార్‌

– పోటీ నుండి తప్పుకున్న బీజేపీ
– ఏకగ్రీవంగా ఎన్నికైన రమేష్‌కుమార్‌
బెంగళూరు, మే25(జ‌నంసాక్షి) : కర్ణాటక విధానసభ స్పీకర్‌గా కాంగ్రెస్‌ నేత రమేశ్‌ కుమార్‌ ఎన్నికయ్యారు. సభాపతి ఎన్నికకు జరిగిన పోటీలో భాజపా నేత సురేశ్‌కుమార్‌ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో రమేశ్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్‌ బోపయ్య ప్రకటించారు. అనంతరం రమేశ్‌ కుమార్‌ సభాపతిగా బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌ పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలో సభాపతి స్థానానికి కాంగ్రెస్‌, భాజపాల మధ్య పోటీ ఏర్పడింది. కాంగ్రెస్‌ తరఫున శ్రీనివాసపురం విధానసభసభ్యుడు కె.ఆర్‌.రమేశ్‌కుమార్‌, భాజపా తరఫున రాజాజీనగర సభ్యుడు ఎస్‌.సురేశ్‌కుమార్‌ గురువారం నామినేషన్లు సమర్పించారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం విధానసభ
ప్రారంభమైన తర్వాత స్పీకర్‌ ఎన్నిక చేపట్టారు. అయితే చివరి నిమిషంలో బీజేపీ వెనక్కితగ్గడంతో స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. కాగా నూతన సభాపతికి ముఖ్యమంత్రి కుమారస్వామి సాదర స్వాగతం పలికారు. సభ్యులంతా కలిసికట్టుగా సభాపతిని ఎన్నుకోవడం హర్షణీయమనీ… రమేశ్‌ కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికీ కుమారస్వామి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి అసెంబ్లీలో ప్రగించిన ఆయన… 1994 నుంచి 1999 వరకు సభాపతిగా ఉన్న రమేశ్‌… స్పీకర్‌ స్థానానికి వన్నెతెచ్చారన్నారు. ఇప్పుడు కూడా అదే ఒరవడిని కొనసాగిస్తారని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు.
స్పీకర్‌ పదవి గౌరవం నిలబెట్టేందుకే – యడ్యూరప్ప
ఏకగ్రీవంగా ఎన్నికైన స్పీకర్‌ రమేశ్‌కుమార్‌కు బీజేపీ శాసనసభా పక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అభినందనలు తెలిపారు. స్పీకర్‌ పదవికున్న గౌరవం నిలబెట్టేందుకే ఏకగ్రీవం చేయాలనుకున్నామని అన్నారు. అందుకే చివరి నిమిషంలో స్పీకర్‌ అభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు. సభలో తమ్ముడు కూమరస్వామి తనను గౌరవిస్తూ మాట్లాడినందుకు యడ్యూరప్ప కృతజ్ఞతలు చెప్పారు. గతంలో స్పీకర్‌గా అనుభవమున్న రమేశ్‌కుమార్‌ మళ్లీ స్పీకర్‌ కావడం సంతోషకరమని యడ్యూరప్ప పేర్కొన్నారు.