కర్నాటక తరహాలో ఎన్నికల అనంతర పొత్తులు

ఎక్కువ పార్టీలది అదే అభిప్రాయం

సిపిఎం తీరు కూడా ఇదే

న్యూఢిల్లీ,మే25(జ‌నంసాక్షి): కర్నాటకలో ఐక్యతను చాటిన విపక్షాలు రానున్న ఎన్నికల నాటికి కార్యాచరణకు రంగం సిద్దంచేస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి పెను మార్పులు తప్పవని అంటున్నారు. కర్నాటక స్ఫూర్తితో ముందుకు సాగాలని కాంగ్రెస్‌ కూడా కోరుకుంటోంది. మార్పులు తప్పవని,కీలక పాత్ర పోషించాలని ఎపి సిఎంచంద్రబాబు నాయుడు కూడా కసిగా ఉన్నారు. అయితే ఎవరు ఎలా ముందుకు సాగాలన్నది ఎవరికి వారు అంచానాలు వేసుకుంటున్నారు. ఫ్రంట్‌గా సాగడమా లేక విడిగా పోటీ చేయడమాఅన్నది రానున్న కాలంలో తేలనుంది. వామపక్షాల్లోనూ ఇదంలుఓ భేదాభిప్రాయాలు ఉన్నాయి.

ప్రతిపక్షాల మధ్య ఏ పొత్తు అయినా ఎన్నికల తరువాతే ఏర్పడగలదని సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. కార్నాకలో ఇదే జరిగిందని అన్నారు. బిజెపికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు గురించి జోరుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏచూరి ఈ ప్రకటన చేశారు. ఎన్నికలకు ముందు జాతీయ స్థాయిలో ఇటువంటి కూటమి ఏర్పాటు సాధ్యం కాదంటున్నారు. 1996 లేదా 2004 అనుభవాన్ని చూసినా ఎన్నికల తరువాతే పొత్తులు ఏర్పడ్డాయి తప్ప ముందు ఏర్పడలేదన్నారు. ఇప్పుడు కూడా లోక్‌సభ ఎన్నికల తరువాతే ఏ పొత్తు అయినా ఏర్పడగలదు. భారత్‌ లాంటి ఎంతో వైవిధ్యం కలిగిన దేశంలో మూసపోసినట్లు ఒకే విధమైన వ్యవస్థ వుండదు. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ప్రధాన పోటీదారులుగా వుంటాయని ఏచూరి వివరించారు. కర్నాటక అనుభవాన్ని ఏచూరి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఇది ప్రతిపక్షాలకు ఉత్సాహాన్నిస్తుందన్నారు. ఎన్నికల్లో బిజెపి ఓడిపోయినా ప్రభుత్వాలను ఏర్పాటు చేసే కళలో బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా దిట్ట అని ఏచూరి ఎద్దేవా చేశారు. బెంగాల్‌లో బిజెపి, తృణమూల్‌ కాంగ్రెస్‌ రెండూ ప్రమాదకరమైనవి, ఒకే నాణెళినికి వున్న రెండు పార్శ్వాల వంటివని ఏచూరి వ్యాఖ్యానించారు. బెంగాల్‌లో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయింద న్నారు. బెంగాల్‌లో స్థానిక ఎన్నికలు జరిగినంత ఘోరంగా దేశంలో ఎక్కడా జరిగి ఉండవని, ఎన్నికల పక్రియను తృణమూల్‌ ప్రభుత్వం పూర్తిగా తొత్తడం చేసిందని ఏచూరి విమ ర్శించారు. ఇక్కడ ఈ రెండు పార్టీలతో కలవడం అననది సిపిఎంకు కుదరని పని. తృణమూల్‌ కాంగ్రెస్‌తో తమ పార్టీ ఇప్పుడే కాదు, ఎప్పుడూ ఎలాంటి పొత్తు కుదుర్చుకునే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో

పార్టీలు ఎక్కడిక్కడ తమవంతుగా పోటి చేసి, ఎన్నికల అనంతరం జతకట్టాలని అభిప్రాయపడ్డారు. చంద్రబాబుకు, కెసిఆర్‌కు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. వారు కాంగ్రెస్‌తో జతకట్టే ప్రశ్నే రాదు.