కలిసిపోరాడుదాం రండి
స్థానిక సంస్థల ఎన్నికల్లో
కలిసిపోరాడుదాం రండి
నారాయణకు రాఘవులు లేఖ
హైదరాబాద్, జూలై 4 : ఓ పక్క ఐక్య ఉద్యమాలకు సన్నద్ధం కావాలని ఉవ్విళ్ళూరుతూనే మరో వైపు అభిప్రాయభేదాలతో వామపక్షాలు సతమతమవుతున్నాయి. ప్రజలను చైతన్యం చేసేందుకు ఐక్యంగా కార్యాచరణ రూపొందించుకుని ప్రజలను సంఘటితం చేసి తమ పట్టు నిలబెట్టుకోవాలని సిపిఐ, సిపిఎం పార్టీలు భావిస్తున్నా ఇది కార్య రూపం దాలుస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారంనాడుసిపిఐ కార్యదర్శి నారాయణకు సిపిఎం కార్యదర్శి రాఘవులు లేఖ రాశారు. స్థానిక సంస్థల్లోనైనా కలిసి పోటీ చేద్దామని రాఘవులు సిపిఐకార్యదర్శి నారాయణను ఆ లేఖ ద్వారా ఆహ్వానించారు. ఉప ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు విషయంలో పునరాలోచించుకోవాలని సిపిఎం సూచించిందని నారాయణ ఓ పత్రికకు రాసిన వ్యాసంలో చెప్పడాన్ని రాఘవులు ఖండించారు. తాము ఎన్నడూ అలాంటి ఆలోచన చేయలేదని రాఘవులు స్పష్టం చేశారు. ప్రజల్లో తమకు ఉన్న పునాదిని నిలబెట్టుకోవడానికే ఇటీవలి ఉప ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. వామపక్షాలకు ప్రజల్లో ఉన్న పట్టును నిలుపుకునేందుకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీలు ఉమ్మడి పోరు సాగించాల్సిన అవసరం ఉందని రాఘవులు గుర్తు చేశారు. ఇటీవల తమ రాష్ట్ర కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఆయన నారాయణకు ఆ లేఖ రాశారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ అవకాశవాదం, అవినీతిలో మునిగిపోయాయని రాఘవులు విమర్శించారు. కుల,మత, ప్రాంతీయ తత్వాలతో ప్రజలను ఓట్ల కోసం వినియోగించుకుంటున్నాయని ఆయన విమర్శించారు. ఈ స్థితిలో ప్రజా సమస్యలపై ఎన్నో పోరాటాలు చేసిన కమ్యూనిస్టు పార్టీలు ప్రజా చైతన్యాన్ని సంఘటితం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇటీవల ఉప ఎన్నికల్లో సిపిఎం, సిపిఐ చేరో దారి పట్టాయి. ఉభయ కమ్యూనిస్టుల మధ్య విభేదాలను తొలగించుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలకు రాఘవులు తాజా లేఖ అద్దం పడుతోంది.