కలిసుందామని.. కేసీఆర్‌కు నచ్చజెప్పా
– ఎంత చెప్పినా వినిపించుకోలేదు
– అయినా మోదీతోనే కేసీఆర్ కుమ్మక్కయ్యాడు
– హైదరాబాద్, అమరావతి అన్నదమ్ములు
– రెండు రాష్ట్రాల అభివృద్ధి తన అభిమతం
– విూడియాపై ఆంక్షలు విధించి పాలన సాగిస్తున్నారు
– మోదీ పాలనలో దేశం క్షోభిస్తోంది..
– అందుకే మోదీ వ్యతిరేక ఫ్రంట్ కడుతున్నాం
– 10న జరిగే సమావేశంలో ఢిల్లీ స్థాయి కార్యాచరణపై చర్చిస్తాం
– విూడియా ఎడిటర్ల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్, నవంబర్29(జనంసాక్షి) : తెలుగు రాష్ట్రాల్లో స్నేహపూర్వక ప్రభుత్వాలు ఉంటే, జాతి ప్రజలు అభివృద్ధిలో పయనించవచ్చని తాను కేసీఆర్ కు ఎంత చెప్పానని, కానీ ఆయన మాత్రం తన మాట వినలేదని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. గురువారం విూడియా ఎడిటర్లతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యలు మాట్లాడుకుంటే పరిష్కారం అవుతాయని తానిచ్చిన సలహాను, మోదీ మాటలను నమ్మి కేసీఆర్ పాటించలేదని చంద్రబాబు పేర్కొన్నారు. హైదరాబాద్, అమరావతి అన్నదమ్ముల వంటివని, రెండు నగరాలూ మరింతగా అభివృద్ధి చెందాలన్నదే తన అభిమతమని ఆయన అన్నారు. దేశంలోనే హైదరాబాద్ ఓ ఆణిముత్యం వంటి నగరమని, ఇటువంటి సిటీ మరెక్కడా లేదని పేర్కొన్నాడు. ఒక్కసారి నరేంద్ర మోదీ అభివృద్ధి చేశానని చెప్పుకునే అహ్మదాబాద్, గాంధీనగర్ లను, తాను డెవలప్ చేసిన హైదరాబాద్, సైబరాబాద్ లను పోల్చి చూడాలని సవాల్ విసిరారు. హైదరాబాద్ కోసం తానెన్నో కలలు కన్నానని, ఇప్పుడూ కంటూనే ఉన్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇప్పుడు అమరావతి గురించి కూడా అటువంటి కలలనే కంటున్నానని అన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విభజన హావిూలపై ప్రధానిని కలసి నిలదీద్దామని తాను ఎన్నిమార్లు చెప్పినా కేసీఆర్ వినలేదని, ఒక్కసారి కూడా తనతో కలసి న్యూఢిల్లీకి రాలేదని చంద్రబాబు ఆరోపించారు. తెలంగాణలో విూడియాకు స్వేచ్ఛ లేదని చంద్రబాబు అన్నారు. నిస్పాక్షికంగా వాస్తవాలు రాసే పరిస్థితి లేదని, ఢిల్లీ స్థాయిలో కూడా అలాగే ఉందని అన్నారు. రాహుల్ గాంధీతో తాను సమావేశమయ్యాక విూడియాలో కాస్త కదలిక వచ్చిందని, జాతీయ స్థాయి విూడియా ప్రతినిధులంతా రాహుల్‌తో తన ఉమ్మడి ప్రెస్ కాన్ఫిరెన్స్‌ను అడ్రస్ చేసేందుకు వచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు. చాలా రోజుల తర్వాత విూడియా ఇంత పెద్ద స్థాయిలో రావడం చూశానని రాహుల్ గాంధీనే అన్నారంటూ పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోండని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేసీఆర్ తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా తాను మాత్రం హుందాగానే జవాబిస్తానన్నారు. ఉత్తరప్రాంతంలో ఉన్న జిల్లాలతో సహా తెలంగాణలో మూలమూలాకు తానేంటో తెలుసన్నారు. ప్రజాకూటమికి అనుకూలంగా బ్రహ్మాండమైన తీర్పు రావడం చూడబోతున్నామని ఎడిటర్లతో సమావేశంలో చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
మోదీ పాలనలో దేశం క్షోభిస్తోంది..
నెగిటివిటీ, భయం, ఆందోళనలకు బ్రాండ్ అంబాసిడర్ మోదీ అని బాబు తీవ్ర విమర్శలు చేశారు.
వ్యవస్థలను నాశనం చేసి అభివృద్ధి లేకుండా చేసి ప్రధాని మోదీ తీవ్రంగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. మోదీ పరిపాలనలో దేశం మానసికంగా క్షోభిస్తోందంటూ చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ కన్నా సగటు పౌరుడు కూడా మెరుగ్గా ఆలోచించగలడని, పరిపాలించగలడని అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత స్వేచ్ఛను కూడా హరించే ఇంత దుర్మార్గమైన పాలన తన ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. దేశంలో ఎంతో సంక్షోభం ఉంది కాబట్టే మోదీ వ్యతిరేక ఫ్రంట్ కడుతున్నామని చంద్రబాబు చెప్పారు. పదో తేదీన జరిగే సమావేశంలో ఢిల్లీ స్థాయి కార్యాచరణపై చర్చిస్తామని చంద్రబాబు అన్నారు.