కలెక్టరేట్‌ ఎదుట కులసంఘాల జెఎసి ధర్నా

నిజామాబాద్‌, జనవరి 28 (: కేంద్ర ప్రభుత్వం తెలంగాణను మోసపుచ్చుతుందని నాలుగున్నర కోట్ల ప్రజలను గౌరవించకుండా కాలయాపన చేస్తోందని ఆరోపిస్తూ కులసంఘాల జెఎసి సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంగారెడ్డి సీనియర్‌ న్యాయవాది రాజేందర్‌రెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణకు గడువంటూ ఏదీ లేదని కేంద్రమంత్రులు షిండే, ఆజాద్‌లు ప్రకటించి మోసం చేశారని విమర్శించారు. ఇప్పటికే గత డిసెంబర్‌ 28 అఖిలపక్ష సమావేశంలో అన్ని రాజకీయపార్టీల అభిప్రాయాలను సేకరించిన కేంద్రం మరోసారి చర్చలు జరుపుతామనడం సిగ్గుచేటని ఆరోపించారు. కాలయాపన కోసమే కేంద్రప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు అంశాన్ని ప్రకటించడం లేదని వారు ఆరోపించారు. తెలంగాణను ప్రకటించేంతవరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని కుల సంఘాల జెఎసి అధ్యక్షుడు సుదర్శన్‌రావు తెలిపారు. ఈ ధర్నాకు బార్‌ అసోసియేషన్‌, వైయస్సార్‌ సీపీ నాయకులు మద్దతు తెలిపారు.