కల్వకుర్తి లో తూనికల కొలతల అధికారుల ఆకస్మిక తనిఖీలు

తూతూ మంత్రంగా తనిఖీలు
•నామమాత్రపు కేసులు
•అధికారి అవతారం ఎత్తిన డ్రైవర్
•సాధారణ తనిఖీలతో కాలయాపన చేస్తున్న అధికారులు

నాగర్ కర్నూలు జిల్లాబ్యూరో సెప్టెంబర్ 21జనంసాక్షి: కల్వకుర్తి పట్టణంలో బుధవారం తూనికల కొలతల అధికారుల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గత కొంతకాలంగా పట్టణంలో కొన్ని దుకాణాలలో ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్న మాల్స్ మరియు దుకాణాలపై పలుపత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించి తనిఖీలు నిర్వహిస్తున్నారు అని పట్టణ ప్రజలు అనుకున్నారు…. కానీ సాధారణ తనిఖీల్లో భాగంగా కల్వకుర్తి పట్టణంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
నాగర్ కర్నూలు జిల్లా తూనికల కొలతల అధికారి రామ్మోహన్ ఆధ్వర్యంలో కల్వకుర్తి పట్టణంలో పలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు
తనిఖీల్లో భాగంగా సైదులు కిరాణం, సిద్ధి వినాయక హార్డ్వేర్, హైమాతాజీ హార్డ్వేర్ దుకాణాల్లో, నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న వస్తువులను గుర్తించి దుకాణ యజమానులపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
కిరాణా షాపుల్లో కంపెనీ పేరు గాని మరియు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేకుండా విక్రయిస్తున్న కొన్ని సరుకులను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు నాగర్ కర్నూల్ జిల్లా తూనికల కొలతల అధికారి రామ్మోహన్ తెలిపారు.
తనిఖీలు నిర్వహిస్తున్న సిబ్బంది పై అయిమాతాజీ అనే హార్డ్వేర్ దుకాణ నిర్వాహకులు తిరగబడ్డారు మీరు ఎవరు మా షాప్ లో తనిఖీలు చేయడానికి అంటూ అధికారులపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండ పంచనామా నిర్వహిస్తున్న సమయంలో సహకరించకుండా గెంటి వేసే ప్రయత్నం చేశారు. దీంతో చేసేది లేక సదరు వ్యాపారికి నోటీసులు అందచేసి అధికారులు వెనుతిరిగారు
తూనికల కొలతల అధికారులు తనిఖీలు చేస్తున్నారని పత్రికా విలేకరుల సమాచారం తెలియడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేసులు బుక్ చేసి
పూర్తిస్థాయిలో తనిఖీలు చేయకుండా నామమాత్రపు తనిఖీలు చేస్తూ నామమాత్రపు తనిఖీల్లో కూడా అధికారి చేయాల్సిన పని డ్రైవర్ వెంకటేష్ తో చేపించి నామమాత్రపు ఫైన్లతో కేసులు బుక్ చేసి చేతులు దులుపుకున్నారు. సాధారణ తనిఖీలు చేస్తూ కలయాపన చేస్తున్న అధికారుల కారణం గా పట్టణంలో ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారస్తులు ఇష్టానుసారంగా ప్రజలను దోచుకుంటున్నారు.
ముఖ్యంగా దసరా పండుగ దృష్టిలో ఉంచుకొని కిరాణా షాపుల మరియు నిత్యావసరవస్తువులు అమ్మే వ్యాపారస్తులు ప్రజలను దోచుకునే అవకాశం ఉన్నందున వ్యాపారస్తులపై సంబంధిత శాఖ అధికారుల నిరంతరం పర్యవేక్షణ ఉండాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.