కల్వర్టును పేల్చివేసిన మావోయిస్టులు
బంద్ పిలుపు నేపథ్యంలో దుశ్చర్య
భద్రాచలం,మే4(జనం సాక్షి ): భద్రాచలం – వెంకటాపురం జాతీయ రహదారిలో చర్ల మండలం సత్యన్నారాయణపురం వద్ద శుక్రవారం తెల్లవారు జామున మావోయిస్టులు రహదారి కల్వర్టును మందుపాతర్లతో పేల్చివేశారు. ఇటీవల జరిగిన గడ్చిరౌలి ఎన్‌కౌంటరుతో పాటు ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటరును నిరసిస్తూ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర సమితి శుక్రవారం రాష్ట్ర బందుకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఇక్కడికి పెద్దఎత్తున కూంబింగ్ కోసం వచ్చిన పోలీసు బలగాల కళ్పుగప్పి మావోయిస్టులు ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టును పేల్చి తమ నిరసన తెలిపారు. ఘటనకు సవిూపంలోనే పోలీసు ఔట్‌పోస్ట్ ఉన్నప్పటికీ మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇదిలాఉండగా బంద్ నేపథ్యంలో మండలంలో దుకాణాలు, వ్యాపార సంస్థలు, సినిమా హాళ్లు మూతపడ్డాయి. సీఐ సత్యన్నారాయణ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. బంద్ సందర్భంగా ఎవరు కూడా భయపడవద్దని అన్నారు. పోలీసులు రక్షణ ఇస్తారని అన్నారు.