కళంకితులంటే మేమూరుకోం…

అసెంబ్లీలో అవినీతి మంత్రుల్ని వెనకేసుకొచ్చిన సీఎం
హైదరాబాద్‌, జూన్‌ 18 (జనంసాక్షి) :
మంత్రులను కళంకితులు అంటే మేమూరుకోబోమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రతిపక్షాలపై విరుచుపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను వెనకేసుకొచ్చారు. కళంకిత మంత్రుల వ్యవహారంపై అసెంబ్లీలో దుమారం రేగింది. కాంగ్రెస్‌, టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులకు సభలో మాట్లాడే అవకాశం ఇస్తే తాము వాకౌట్‌ చేస్తామని తెలుగుదేశం పార్టీ హెచ్చరించడం, ఆ పార్టీ చేసిన విమర్శలను ప్రభుత్వం తిప్పికొట్టడం, ఇరు పక్షాలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో వాగ్వాదానికి దిగడంతో సభ మంగళవారం పలుమార్లు వాయిదా పడిరది. కళంకిత మంత్రులను ఎందుకు తొలగించడం లేదని టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీసింది. సభలో కళంకిత మంత్రులు మాట్లాడితే తాము సభలో ఉండబోమని పేర్కొన్నారు. అయితే, కళంకిత మంత్రులకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బాసటగా నిలిచారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ మంత్రి పదవులకు రాజీనామా చేసిన సీనియర్‌ నేతలను ఆయన వెనుకేసుకొచ్చారు. అసెంబ్లీలో విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. మంత్రులు ఎక్కడా తప్పు చేయలేదని, రాజీనామా చేసినంత మాత్రానా తప్పు చేసినట్లు కాదన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కళంకిత మంత్రులను తొలగించాలని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మంగళవారం అసెంబ్లీలో ఆందోళన చేపట్టింది. అవినీతి మంత్రులపై చర్యలు తీసుకోవాలని సభా కార్యక్రమాలను అడ్డుకుంది. కళంకిత మంత్రులకు సభలో మాట్లాడే అవకాశం కల్పిస్తే తాము సభలో ఉండబోమని టీడీపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కిరణ్‌ జోక్యం చేసుకుంటూ ప్రతిపక్ష పార్టీపై విరుచుకుపడ్డారు. మంత్రులకు బాసటగా నిలిచారు. కళంకిత మంత్రులు అని అనడంపై కిరణ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రులు రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నట్లు ఎక్కడా రుజువు కాలేదన్నారు. మంత్రులకు కోర్టు పరిధిలో ఉన్న అంశంపై మాట్లాడడం సరికాదంటూనే.. మంత్రులు తప్పు చేయలేదని తేల్చేశారు. క్విడ్‌ ప్రోకో సంబంధం లేకపోయినా.. దర్యాప్తు జరుగుతున్నందున, చార్జిషీట్‌ వేశారు కనుక ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేశారన్నారు. చార్జిషీట్‌లో అభియోగాలు నమోదు చేయడంతో ఇద్దరు మంత్రులు నైతిక బాధ్యత వహిస్తూ, కాంగ్రెస్‌ పార్టీ విధానాలకు అనుగుణంగానే రాజీనామా చేశారన్నారు. అంత మాత్రాన వారు తప్పు చేసినట్లు కాదని తెలిపారు. మిగిలిన మంత్రులపై సీబీఐ ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదని, అందువల్ల వారిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. మంత్రులు తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరుగుతోందని, నిజానిజాలు కోర్టులోనే తేలుతాయని తెలిపారు. అయినా, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, కేసుల్లో చిక్కుకొని స్టేలు తెచ్చుకున్న వారు తమను విమర్శించడం హాస్యాస్యదమని టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి విమర్శించారు. టీడీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాలు కూడా కోర్టులలో ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్‌ నేతలు మాత్రమే జైలుకు వెళ్లారా? టీడీపీ నేతలు వెళ్లలేదా? అని ప్రశ్నించారు. స్టాంప్‌ కుంభకోణంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రి ఎన్నేళ్లు జైలులో ఉన్నారో మరిచిపోయారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ గురించి మాట్లాడడం సరికాదన్నారు. అంతకు ముందు ఆయన చేసిన పలు వ్యాఖ్యలు తెలుగుదేశం నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.అంతకు ముందు, కళంకిత మంత్రుల అంశంపై జరిగిన చర్చ సందర్భంగా టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌ మాట్లాడుతూ ప్రభుత్వంపై మండిపడ్డారు. మంత్రులపై విచారణ జరపాలని హైకోర్టుకు వెళ్లింది తొలుత తెలుగుదేశం పార్టీయేనని గుర్తు చేశారు. త్వరలో మరో ముగ్గురు మంత్రులు జైలుకు వెళ్తారన్నారు. దొంగల బండికి ముఖ్యమంత్రి సారథ్యం వహిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుపై విజయమ్మ చేసిన ఆరోపణలను దేశ సర్వోన్న న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కొట్టివేసిందన్నారు. చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలదేని కోర్టులే తేల్చాయని గుర్తు చేశారు. తాము ఎప్పటికైనా నిర్దోషులమేనన్నారు. అయితే, పయ్యావుల విమర్శలను మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తిప్పికొట్టారు. అసలు ఈ కేసులో పిటిషనర్‌ ఏయే ఆరోపణలు చేస్తూ పిటిషన్‌ వేశారో తెలియకుండా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆ పార్టీ ఆరోపణలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. చంద్రబాబు సభలో ఉంటే వారి పార్టీ చేస్తున్న విమర్శలను సమర్థించే వారు కాదని, అసలు ఈ అంశంపై చర్చకు వచ్చేదే కాదన్నారు. తాము ఎక్కడా రాజ్యాంగానికి విరుద్ధంగా నడుచుకోలేదని, నిబంధనలకు లోబడే పని చేశామన్నారు. టీడీపీలాగా ఇష్టానుసారంగా భూములు దోచిపెట్టలేదని విమర్శించారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారం భూముల కేటాయింపులు జరిపిందన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం హైదరాబాద్‌లో వందల ఎకరాలను ఎలా కట్టబెడుతుందని ప్రశ్నించారు. తప్పు మీరు చేసి మమ్మల్ని ప్రశ్నిస్తారా? అని టీడీపీ ఎమ్మెల్యేలను నిలదీశారు. ధర్మాన వ్యాఖ్యలపై ఖండిరచిన టీడీపీ నేతలు కళంకిత మంత్రులను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు. సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో సభాపతి సభను సాయంత్రానికి వాయిదా వేశారు. అంతకు ముందు కళంకిత మంత్రుల అంశంపై చర్చ సందర్భంగా మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. టీడీపీ దొంగల పార్టీ అని.. అనేక పథకాల ద్వారా ఆ పార్టీ నేతలు రాష్టాన్న్రి దోచుకున్నారని, టీడీపీ చరిత్ర అంతా తన దగ్గర ఉందని విమర్శించారు. జన్మభూమి, పనికి ఆహార పథకం, స్టాంపులు, స్కాలర్‌షిప్పుల్లో టీడీపీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు. సీబీఐ దర్యాప్తులో తన ప్రస్తావన లేదని, తనపై తప్పుడు రాతలు రాయిస్తూ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కన్నా వ్యాఖ్యలపై ఖండిస్తూ తెలుగుదేశం సభ్యులు స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు. గందరగోళం నెలకొనడంతో డిప్యూటీ స్పీకర్‌ మల్లు భట్టివిక్రమార్క సభను 15 నిమిషాలు వాయిదా వేశారు.