కళంకితులే మంత్రులుగా ఉంటే?

శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగంపై ప్రమాణ స్వీకారం చేసే మంత్రులు రాగద్వేషాలకు, ఈర్ష్యాసూయలకు దరిచేరకుండా ప్రజల పక్షాన విధులు నిర్వహించాలి. తమ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ పథకాలు సక్రమంగా ప్రజలకు చేర్చే బాధ్యత మంత్రులది. ఈ క్రమంలో చోటు చేసుకునే ప్రతి పరిణామానికి సంబంధిత మంత్రే బాధ్యత వహించాలి. ఏవైనా లోటుపాట్లు చోటుచేసుకుంటే సంబంధిత మంత్రి నైతిక బాధ్యత తీసుకొని పదవి నుంచి తప్పుకోవాలి. ఒకప్పుడు మంత్రులు ఇంతే నిక్కచ్చిగా ఉండేవారు. విశాల భారతదేశంలో ఎక్కడో రైలు ప్రమాదం జరిగి ప్రయాణికులు మృతిచెందితే అందుకు బాధ్యత వహిస్తూ అప్పటి రైల్వేశాఖ మంత్రి లాల్‌బహదూర్‌శాస్త్రి తన మంత్రి పదవిని త్యజించారు. అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ వద్దని వారిస్తున్నా వినలేదు. తన శాఖ సిబ్బందిని అలసత్వం ఆవరించి ప్రమాదం జరిగిందంటే అందులో తన బాధ్యత కూడా ఉందని చెప్పి నిజాయితీని చాటుకున్నాడు. ప్రతిపక్షాలు తనపై దుమ్మెత్తి పోస్తాయనో.. మరోకారణాలతోనో శాస్త్రి పదవిని వదులుకోలేదు. మంత్రి అంటే ఎంత బాధ్యతగా ఉండాలో చాటిచెప్పేందుకే పదవిని వదులుకున్నారు. ఆయన వారసత్వాన్ని కొందరు అందిపుచ్చుకున్నారు. తమ శాఖలోని లోపాలకు బాధ్యత వహించారు. మంత్రి పదవులను వదులుకున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ల వ్యవహారంలో జనతాదళ్‌ నేత రామకృష్ణ హెగ్డే మంత్రి పదవికి రాజీనామా చేసి నిజాయితీ చాటుకున్నాడు. రాష్ట్రంలోనూ వారి నుంచి స్ఫూర్తిపొందిన వారున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్‌ అయితే గాలి ముద్దుకృష్ణమనాయుడు నైతిక బాధ్యత వహించారు. తన శాఖలోని కొందరు స్వార్థపరులు చేసిన తప్పిదానికి మంత్రి పదవిని వదులుకున్నారు. తర్వాతికాలంలోనూ కొందరు మంత్రులు తమ తమ శాఖల్లో బయల్పడిన అవినీతి, అక్రమాలతో మంత్రివర్గాన్ని వీడాల్సి వచ్చినా అది తమకు తాముగా తీసుకున్న నిర్ణయం కాదు. ప్రతిపక్షాల నుంచి వెల్లువెత్తిన ఆరోపణలు, ప్రజల నుంచి హోరెత్తిన నిరసనలకు జడిసి ప్రభుత్వ పెద్దల జోక్యంతో పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు శాస్త్రిలు, హెగ్డేలు దుర్భిణి వేసి వెదికినా కనిపించరు. రాజకీయాల్లో బాధ్యత లోపించింది. పాలకుల్లో మరింత లోపించింది. ప్రజలు అధికారం ఇచ్చేవరకూ వారి పక్షాన చేరి అధికారపార్టీని ఎండగట్టడం, రోడ్లపై చేరి బూటకపు ఆందోళనలతో ఓట్లు దండుకొని కుక్కతోక వంకరే అన్నట్టు పాలక్షపక్ష విధానాలు ఆచరించడం ఇప్పుడు పరిపాటి. అధికారంలో ఎవరున్నా దోపిడీ విధానాలు అనుసరించడం, ప్రపంచ బ్యాంకుకు తొత్తులుగా వ్యవహరించడం ఇప్పుడు మామూలే. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రులుగా ఉండే వ్యక్తులపై దోపిడీ, కుట్ర తదితర కేసులు నమోదైనా నిస్సిగ్గుగా పదవులను అంటిపెట్టుకొనే ఉంటున్నారు. ఓ మంత్రి సీబీఐ అరెస్టు చేసిన తర్వాత పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. మరో మంత్రిపై సీబీఐ అభియోగాలు నమోదు చేసినా మొత్తం మంత్రివర్గం ఆయనకు వెన్నంటి నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెచ్చిన జీవోల ద్వారా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్మోహన్‌రెడ్డి అనుచిత లబ్ధి పొందాడనే ఆరోపణలపై ప్రారంభమైన సీబీఐ దర్యాప్తు ఇప్పుడు సర్కారు మెడకే చిక్కుకుంది. జగన్‌ కంటే ముందే ఓ మంత్రిని సీబీఐ అరెస్టు చేయగా మరో ఐదుగురు మంత్రులపై ప్రస్తుతం విచారణ సాగుతోంది. ఈ క్రమంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలపై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. సీబీఐ మొదట అరెస్టు చేసిన మంత్రి మోపిదేవి వెంకటరమణ మినహా మిగతా ఐదుగురు మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలకు ఈ కేసుల నుంచి ఊరనిచ్చేందుకు సర్కారు ప్రజాధనాన్ని ఖర్చుచేసి న్యాయసహాయాన్ని అందించాలని నిర్ణయించింది. ఇలాంటి మంత్రివర్గానికి మిస్టర్‌ క్లీన్‌గా తనకు తాను కీర్తించుకునే కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి. ప్రజాధనాన్ని అప్పనంగా దోచిపెట్టడంలో మంత్రుల పాత్ర లేనే లేదనేది వారి సహచరుల అభిప్రాయం. వారికి ప్రమేయం ఉందో లేదో తేల్చాల్సింది సీబీఐ విచారణ. కానీ మంత్రులే సహజరులకు సర్టిఫికెట్‌ ఇచ్చేస్తున్నారు. అంటే అధికారపక్షంలో విలువలెంతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు 420గా అభియోగాలు ఎదుర్కొంటోన్నది రాష్ట్ర హోంశాఖ మంత్రి. సీబీఐ జగన్‌ అక్రమాస్తుల కేసులో దాఖలు చేసిన ఐదో చార్జిషీట్‌లో ఆమె నంబర్‌ నాలుగు. హోం మంత్రి ఇంత తీవ్రమైన అభియోగాలు మోపినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదు. దీనిపై ఢిల్లీలో కాస్త కదిలిక కనిపించినా అది విశ్వసనీయత చాటుకునేది కాకుండా వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం పడుతుందనేదానిపైనే ఎక్కువగా చర్చసాగింది. మంత్రివర్గంలో ఆరుగురిపై సీబీఐ విచారణ సాగుతుందంటే అసలు ఆ ప్రభుత్వానికి విశ్వసనీయత ఉంటుందా? ఇలాంటివ్యక్తులు పరిపాలిస్తున్న రాష్ట్రంలో ప్రజలు క్షేమమేనా? ప్రజాస్వామ్యం పదిలమేనా? ఇలాంటి ప్రశ్నలే సామాన్య ప్రజలందరినీ చుట్టుముడుతున్నాయి. వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముమ్మాటికీ ప్రభుత్వానిదే.