కవాతుపై తుది నిర్ణయం సీఎందే : జానా

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 26 (జనంసాక్షి): స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పి వేయాలని నిర్ణయించినట్టు మంత్రి కె.జానారెడ్డి చెప్పారు. సచివాలయంలో బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నిధులు నిలిపేయొద్దని కేంద్రాన్ని కోరనున్నట్టు చెప్పారు. తెలంగాణ కవాతు అనుమతి విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిదే తుది నిర్ణయమని చెప్పారు. తెలంగాణ కవాతుకు అనుమతి ఇస్తే మంచిదని ఐకాస నేతలు తనతో చెప్పారన్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానన్నారు. తాను మధ్యవర్తిని కానని.. బాధ్యత గల మంత్రినని చెప్పారు. ఐకాస నేతలు తనతో అనేక విషయాలు చెప్పారని, వాటిన్నింటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి.. చర్చిస్తామని చెప్పారు. శాంతియుతంగా జరుపుతామని ఐకాస నేతలు చెబుతున్నారన్నారు. ఒకవేళ అనుకోని సంఘటనలు జరిగితే రాష్ట్రానికి చెడ్డపేరు వస్తుందన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నట్టు తెలుస్తోందన్నారు. అయినప్పటికీ ఆయనతో అన్ని విషయాలు చర్చిస్తామని వెల్లడించారు. జెఎసి నిర్ణయాలను కూడా ముఖ్యమంత్రి ఎదుట పెడతానన్నారు. తుది నిర్ణయం మాత్రం సిఎందేనని నొక్కి
చెప్పారు.