కష్టకాలంలో ఇన్ఫోసిస్‌లోకి నారాయణమూర్తి

బెంగళూరు,  జూన్‌ 1 (జనంసాక్షి) :
ఇన్ఫోసిస్‌ ప్రస్తుత పరిస్థితుల్లో సవాళ్లు ఎదుర్కొంటోందని ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా మరోసారి నియమితులైన నారాయణమూర్తి అన్నారు. దీనిని గట్టెక్కించేందుకు తనశాయశక్తులా కృషి చేస్తానన్నారు. సవాల్‌తో కూడిన ప్రస్తుత తరుణంలో కంపెనీకి విలువ చేకూర్చే విధంగా పనిచేస్తానని ఆయన చెప్పారు. ఎగ్జిక్యూటివ్‌ బోర్డులోని సభ్యులు ఆయన్ని ఏకగ్రీవంగా శనివారం ఎన్నుకున్నారు. నారాయణమూర్తి ఈ పదవిలో ఐదేళ్ల పాటు కొనసాగుతారు. అయితే ఇప్పటి వరకు ఆ పదవిలో కొనసాగిన కె.వి.కామత్‌ (65) తన పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన లీడ్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. 2011లో ఇన్పోసిస్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు బాధ్యతల నుంచి నారాయణ మూర్తి తప్పుకున్న విషయం తెలిసిందే. ఇక నారాయణమూర్తి ఈ పదవీ కాలంలో కేవలం ఏడాదికి ఒక్క రూపాయి జీతంతోనే పనిచేస్తారు. జూన్‌ ఒకటి నుంచి నారాయణమూర్తి సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా, అదనపు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తారని ఇన్ఫోసిస్‌ ఓ ప్రకటనలో తెలిపింది. 1981లో ఇన్ఫోసిస్‌ ను నారాయణమూర్తి ప్రారంభించారు. 1981 నుంచి 2002 వరకు ఆయన సీఈవోగా పనిచేశారు. తిరిగి తనను బోర్డులకు ఆహ్వానించడంపై నారాయణమూర్తి స్పందించారు. ఇది అకస్మాత్తుగా, అనూహ్యంగా, అసాధారణంగా జరిగిందని అన్నారు. ఇన్ఫోసిస్‌ తన మిడిల్‌ చైల్డ్‌ అని, దాంతో మిగతా ప్రణాళికలను పక్కన పెట్టి తాను బాధ్యతలను అంగీకరించానని ఆయన అన్నారు. తనకు ఈ అవకాశం కల్పించినందుకు చైర్మన్‌ కెేవీ కామత్‌కు బోర్డుకు, ప్రతి ఇన్ఫోసిసియన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. సాంకేతిక పరిశ్రమ, సంస్థ ప్రస్తుతం ఎదుర్కుంటున్న సవాళ్ల నేపథ్యంలో స్టేక్‌హోల్డర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయం తీసుకున్నామని కామత్‌ అన్నారు. సవాళ్లను ఎదుర్కుంటున్న ఈ సమయంలో ఎగ్జిక్యూటివ్‌ లీడర్‌షిప్‌ను బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నామని అన్నారు.