కస్తూర్బా స్కూళ్లతో మంచిఫలితాలు
ఉచిత వసతితో కూడిన బోధన
నిర్మల్,జూన్8(జనం సాక్షి): నూతన కస్తూర్బాల ప్రారంభానికి కసరత్తు మొదలైంది. పక్కా భవనాల కోసం స్థల సేకరణ పూర్తయింది. నిర్మాణాలు పూర్తయ్యేవరకు తాత్కాలికంగా విద్యాలయాలు కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త మండలాల ఏర్పాటుతో నిర్మల్ జిల్లాలో అదనంగా ఐదు కస్తూర్బా విద్యాలయాలను ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నారు. బాలికలకు విద్య అందుబాటులోకి రావడంతో పాటు జిల్లాకు చెందిన నిరుద్యోగులకు ఉపాధి లభించనుంది. నూతన విద్యాలయాల ప్రారంభంతో లబ్ధి పొందే వారంతా మహిళలే.400 మంది బాలికలకు ఉచిత వసతితో చక్కని విద్యా బోధన అందనుంది. నిర్మల్ అర్బన్, సోన్, నర్సాపూర్(జి), దస్తురాబాద్, పెంబిల్లో కస్తూర్బా విద్యాలయాలను ప్రారంభిస్తున్నారు. ఒక్కో విద్యాలయంలో 15 మంది ఉద్యోగుల అవసరముంటుంది. బోధన కోసం విద్యావంతులకు, వంట ఇతర పనుల నిర్వహణకు నిరక్షరాస్యులకూ నూతన కేజీబీవీల కారణంగా ఉపాధి లభిస్తుంది. బోధన కోసం ఆరుగురు సీఆర్టీలు, నిర్వహణ బాధ్యత చూసుకునేందుకు ఒక ప్రత్యేకాధికారిణి, ఆటలు ఆడించేందుకు వ్యాయామ ఉపాధ్యాయురాలు, అకౌంటెంట్, ఇద్దరు వంట మనుషులు, నైట్‌వాచ్‌మెన్‌లు ఇద్దరు, ఒక స్కావెంజర్, అటెండరు అవసరముంటుంది. జిల్లాకు చెందిన వారినే ఉద్యోగాల్లో నియమిస్తారు. ఇందుకు సంబంధించి దరఖాస్తు పక్రియ మొదలైంది. నూతనంగా ప్రారంభమయ్యే కస్తూర్బాల్లో ఈసారి 6, 7 తరగతులను మాత్రమే నిర్వహిస్తారు. ఆంగ్ల మాధ్యమంలోనేకొనసాగుతాయి. ఒక్కో తరగతిలో 40 మంది బాలికలకు ప్రవేశం కల్పిస్తారు. జిల్లాలోని ఐదు విద్యాలయాల్లో మొత్తం 200 మంది బాలికలకు చదువుకునేందుకు అవకాశం లభిస్తుంది. ఆంగ్లమాధ్యమం చదివిన సీఆర్టీలనే నియమిస్తుండటం, ఎంపిక కోసం పరీక్ష నిర్వహిస్తుండటంతో నైపుణ్యమున్న బోధకులే వస్తారు. విద్యార్థులకు ఇది మంచి అవకాశం. పేద, బడి మానేసిన బాలికలకు విద్యాలయాలు చక్కని భరోసానిస్తాయి. ఇప్పటికే నడుస్తున్న కేజీబీవీల్లో మంచి ఫలితాలు వస్తున్నాయి. పదో తరగతి ఫలితాల్లో జిల్లావ్యాప్తంగా మండల టాపర్లుగా ఐదుగురు కస్తూర్బా విద్యార్థినులే నిలిచారు.