కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయాం

జేఏసీతో ఉన్నవి చిన్న చిన్న విభేదాలే
విభేదాలు పరిష్కరించుకొంటాం
వారం రోజుల్లో కోదండరామ్‌తో మాట్లాడతా
నవంబర్‌ 30 నుంచి పల్లెబాట
మేధోమథన సదస్సులో టీీీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌
కరీంనగర్‌, నవంబర్‌ 7(జనంసాక్షి):
తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ను నమ్మిపోయామని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మండిపడ్డారు. తెలంగాణపై కాంగ్రెస్‌ నాటకాలాడుతోందని, తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్‌ పతనం ఖాయమని హెచ్చరించారు. రెండు రోజుల పాటు కరీంనగర్‌లో జరగనున్న ఆపార్టీ మేధోమదన సదస్సులో భాగంగా తొలిరోజు సమావేశాలలో ఆయన మాట్లాడారు. నవంబర్‌ 30 నుంచి దాదాపు 40 రోజుల పాటు టీఆర్‌ఎస్‌ పల్లెబాట చేపడుతుందని తెలంగాణ తెలిపారు. తొలిరోజు ఆయన ప్రసంగం ఆద్యంతం కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 2014 ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులుండవని ఒంటరిగానే పోటీ చేస్తామని అన్నారు. 2004 ఎన్నికలలో కాంగ్రెస్‌ తెలంగాణ ఇస్తమంటేనే పొత్తు పెట్టుకున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో 15 పార్లమెంటు స్థానాలు, 100 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌కు పదవులు ముఖ్యం కాదని, తాము తెలంగాణ ఉద్యమం కోసమే పనిచేస్తున్నామన్నారు. టీఆర్‌ఎస్‌ వల్లే తెలంగాణ సాధ్యమని ఆయన తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి, వారికి ఉద్యమ బాధ్యతలు అప్పగిస్తమన్నారు. సమర్దులకే పార్టీలో కీలక పదవులు ఇస్తామని వివరించారు. కాంగ్రెస్‌ పిలిస్తేనే ఢిల్లీకి చర్చలకు వెళ్లానని చెప్పారు. కానీ కాంగ్రెస్‌ పార్టీ చర్చల పేరుతో కాలయాపన చేసిందన్నారు. చర్చల పేరుతో ఢిల్లీకి పిలిచి కాంగ్రెస్‌ మరోసారి మోసం చేసిందని చెప్పారు. తెలంగాణపై కాంగ్రెస్‌ నాటకాలు ఆడుతుందని అన్నారు. తెలంగాణ జేఏసీని ఏర్పాటు చేసింది తానేనని అలాంటప్పుడు దాన్ని ఎందుకు దూరం చేసుకుంటానని పేర్కొన్నారు. జేఏసీతో ఉన్న విభేదాలు చిన్నవేనని హైదరాబాద్‌ వెళ్లిన తరువాత వారితో మాట్లాడుతానని చెప్పారు. జేఏసీ చైర్మన్‌గా కోదండరామ్‌తో వారం రోజుల్లో మాట్లాడుతానని వెల్లడించారు. మహబూబ్‌నగర్‌, పరకాల స్థానాల్లో జేఏసీ తప్పుదోవ పట్టించిందని అన్నారు. తెలంగాణ ఆకాంక్షను మరోసారి చాటేందుకు ఈనెల 23న నల్లగొండ జిల్లాలోని సూర్యపేటలో భారీ బహిరంగసభ జరుపుతామని చెప్పారు. ఆమరణ దీక్ష చేసి మూడు సంవత్సరాలైన సందర్భంగా ఈనెల29న దీక్షా దివస్‌ నిర్వహిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా నవంబర్‌ 30 నుంచి జనవరి 10 వరకు 40 రోజులపాటు పల్లెబాట నిర్వహిస్తామని తెలిపారు. గురువారం భవిష్యత్తు కార్యాచరణను వెల్లడిస్తామని, దీనిని కరీంనగర్‌ డిక్లరేషన్‌గా ప్రకటిస్తామని తెలిపారు. కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేస్తారని వచ్చిన వార్తలను ఖండించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న సంతోష్‌ అనే విద్యార్థి కుటుంబానికి తమ ప్రగాడ సానుభూతి ప్రకటించారు. యువకులు తెలంగాణ కోసం ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఉద్యమించి తెలంగాణ సాధించుకుందామని చెప్పారు. ఎవరూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులంతా సైనికుల్లాంటి వారని, కావున ధైర్యంతో ముందుకెళ్లాలని సూచించారు. అంతకుముందు కేసీఆర్‌ నేరుగా ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహం వద్దకు చేరుకుని ఆయనకు పూల మాలవేసి నివాళులు అర్పించారు. అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులు అర్పించారు. తరువాత తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పూలమాల వేసి ప్రతిమ మల్టిప్లెక్స్‌కు చేరుకున్నారు. తొలిరోజు సమావేశంలో టీఆర్‌ఎస్‌ జిల్లా కన్వీనర్‌ కెప్టెన్‌ లక్ష్మికాంతరావు, శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్‌రావు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు, ఎమ్మెల్యేలు తారకరామారావు, కొప్పుల ఈశ్వర్‌, జోగు రామన్న, హరీశ్వర్‌రెడ్డి, సిద్దిపేట ఎంపీ విజయశాంతి, వరంగల్‌ ఎమ్మెల్యేలు, హన్మకొండ మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌, సిద్దారెడ్డి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, దేశ్‌పతి శ్రీనివాస్‌, మహిళా నాయకురాళ్లు గుర్రం పద్మ, తాటి ప్రభావతి, బొడిగె శోభ, మల్లిఖార్జున శైలెజ, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు సిద్దం వేణు, టీఆర్‌ఎస్‌ యువజన విభాగం అధ్యక్షుడు కట్ల సతీష్‌, టీఆర్‌ఎస్‌నగర అధ్యక్షుడు రవీందర్‌ సింగ్‌, రాష్ట్ర కార్యదర్శి డి.వెంకటయ్య, ట్రినిట్‌ విద్యాసంస్థల అధినేత డి.మనోహర్‌రెడ్డి, మాజీ మంత్రి రాజేశం గౌడ్‌, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు తుల ఉమ, రాష్ట్ర కార్యదర్శి శానీ అఫ్రొజ్‌, రూప్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.