కాంగ్రెస్‌లో అసమ్మతా.. అది ఫేక్‌ న్యూస్‌

– కాంగ్రెస్‌ వాళ్లే తనకు సీఎం పదవి ఇచ్చారు
– ఐదేళ్లపాటు నేను సీఎంగా ఉంటా
– రజనీకాంత్‌ కర్ణాటక వచ్చి మాట్లాడాలి
– కర్ణాటకలో సరిపడా నీళ్లు లేవు.. తమిళనాడుకెళా ఇస్తాం
– జేడీఎస్‌ నేత కుమారస్వామి
– లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
బెంగళూరు, మే21(జ‌నం సాక్షి) : కాంగ్రెస్‌లో అసమ్మతి లేదని, పలు విూడియాల్లో వస్తున్న కథనాలు ఫేక్‌ న్యూస్‌ అని, కాంగ్రెస్‌ సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేసి ఐదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని జేడీఎస్‌ నేత కుమారస్వామి అన్నారు. హసన్‌లోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కుమారస్వామి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో అసమ్మతి నిజమా? అని విలేకరులు ప్రశ్నించగా.. ‘మిమ్మల్ని ఎవరూ ప్రశ్నించారు? ఆ కథనాలన్నీ బోగస్‌. ఫేక్‌ న్యూస్‌. అందులో నిజం లేదు’ అని కుమారస్వామి తెలిపారు. ప్రజల ఓటుతో తాను సీఎం కావాలనుకున్నానని, కానీ కాంగ్రెస్‌ మద్దతుతో సీఎం అవుతున్నానని కుమారస్వామి అన్నారు. ప్రజలు తనకు సొంతంగా మెజారిటీ ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు. ముఖ్యమంత్రి పదవి కావాలని తాను కాంగ్రెస్‌ పార్టీని అడగలేదని, కాంగ్రెస్‌ వాళ్లే సీఎంగా ఉండమని తనను అడిగారని చెప్పారు. సీఎం పదవి విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపాదనను నాన్న దేవెగౌడ అంగీకరించారని తెలిపారు. రాహుల్‌గాంధీ యువకుడు అని, కాంగ్రెస్‌ను ముందుకు నడిపించాలని అనుకుంటున్నారని చెప్పారు. రాహుల్‌ చేసే పనుల వల్ల బీజేపీకి కొత్త అస్త్రాలు దొరకకూడదని అభిప్రాయపడ్డారు. తన బలపరీక్షకు బీజేపీ ఇబ్బందిపెట్టినా.. తాను గెలిచి తీరుతానని అన్నారు.  ఈ సందర్భంగా కుమారస్వామి కావేరీ వివాదంపై కుండబద్దలు కొట్టేశారు. కావేరి నదీ జలాల విషయంలో కాంగ్రెస్‌ మాటపైనే నిలబడ్డారు. తమిళనాడుతో పంచుకునేందుకు సరిపడినన్ని జలాలు తమవద్ద లేవంటూ తేల్చిచెప్పారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడో అతిపెద్ద పార్టీగా నిలిచిన జేడీఎస్‌.. ఎన్నికల అనంతరం జట్టుకట్టిన కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కాగా కావేరీ జలాల పంపకాల్లో కర్ణాటక సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించాలంటూ ప్రముఖ నటుడు రజినీకాంత్‌ వ్యాఖ్యానించిన నేపథ్యంలో కుమార స్వామి స్పందిస్తూ.. కర్ణాటకలో సరిపడా సాగునీరు ఉంటేనే నీటి విడుదల సాధ్యం… రజినీకాంత్‌ ఇక్కడికి వచ్చి మా డ్యాంలు, రైతుల స్థితిగతులు చూడాలని ఆయనను ఆహ్వానిస్తున్నాను. అది చూసిన తర్వాత కూడా విూకు నీళ్లు కావాలని విూరు అడిగితే… మనం కూర్చుని చర్చించుకుందాం.. అని పేర్కొన్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న కావేరీ వివాదంపై సుప్రీంకోర్టు ఫిబ్రవరి 16న చారిత్రాత్మక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు ప్రకారం.. తమిళనాడుకు కర్ణాటక ప్రభుత్వం ఏటా 177.25 టీఎంసీల కావేరి జలాలను విడుదల చేయాల్సి ఉంటుంది. ఇది ఇంతకుముందు 192 టీఎంసీలుగా ఉంది.