కాంగ్రెస్‌వి కాకి లెక్కలు

4

– ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు

హైదరాబాద్‌,ఆగస్టు 18(జనంసాక్షి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చెప్పిన కాకి లెక్కలనే కాంగ్రెస్‌ నేతలు మళ్లీ చెబుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ  సాగునీటిశాఖ సలహాదారు విద్యాసాగర్‌ రావు విమర్శించారు.  తెలంగాణలో ప్రాజెక్టులు, నీటి వినియోగంపై టీ.కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ప్రచారంపై స్పందించారు. వారి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఆశ్చర్యం కలిగించేదిగా ఉందన్నారు. ఈ మేరకు విద్యాసాగర్‌ రావు విూడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో 47 లక్షల ఎకరాలకు ఎన్నడూ నీరందలేదని పేర్కొన్నారు. ప్రాజెక్టుల కింద ప్రతిపాదించింది ఎంత.. నీరందించింది ఎంత? అని కాంగ్రెస్‌ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్‌ లెక్కలు ప్రజల్ని మరింత గందరగోళానికి గురిచేస్తున్నాయని విద్యాసాగర్‌ రావు  ఆందోళన వ్యక్తం చేశారు. బావుల కింద సాగును కూడా వారు తమ ప్రాజెక్టుల ఖాతాల్లో వేసుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో నిర్మించతలపెట్టిన సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఇప్పటికీ కాంగ్రెస్‌ నేతల మైండ్‌ పెట్‌ మారలేదని విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. రంగారెడ్డి, మెదక్‌, నల్గొండలో కరువు ప్రాంతాలకు నీళ్లు ఇచ్చేందుకే కొత్త రిజర్వాయర్లు నిర్మింపజేసుకోవాల్సిందేనన్నారు. కనీసం 300 టీఎంసీల స్టోరేజి రిజర్వాయర్లు నిర్మించుకోవాల్సి ఉందన్నారు. అలాగే సీఎం కేసీఆర్‌ ధైర్యంగా దుమ్ముగూడెం ప్రాజెక్టును రద్దుచేశారన్నారు. పైనుంచి నిజాంసాగర్‌, సింగూరుకు చుక్కనీరు రావడం లేదని, ఇష్టమున్నా లేకపోయినా మేడిగడ్డ ప్రాజెక్టు అవసరం అన్నారు. అలాగే రీడిజైన్‌ లేకపోతే ప్రాజెక్టులు ఒక్క అడుగు కూడా ముందుకు సాగవని, అప్పట్లో మూడు చోట్ల కాంగ్రెస్‌ అధికారంలో ఉండి 3 వేల ఎకరాలు ఎందుకు సేకరించలేదని ఆయన ప్రశ్నించారు. అలాగే 5జిల్లాలకు సాగునీరు ఇచ్చే మల్లన్నసాగర్‌పై వ్యతిరేకత సరికాదన్నారు. శ్రీశైలం నుంచి ఏపీ ప్రభుత్వం నీళ్లు తీసుకొవద్దంటున్నా… తెలంగాణ విపక్ష నేతలు కూడా ఆవిధంగానే మాట్లాడుతున్నారన్నారు. ప్రాణహిత డిజైన్‌పై సీడబ్ల్యూసీ అవమానకరంగా మాట్లాడిందని, కాంగ్రెస్‌ నేతలు అడిగితే రీడిజైన్‌ గురించి తాను చెప్పేవాడినని, వైఎస్‌ హయాంలో జరిగిన తప్పులపై పి. జనార్ధన్‌రెడ్డి మినహా ఎవరూ మాట్లాడలేదని, అలాగే కాంగ్రెస్‌లో ఉండి దుమ్ముగూడెంను వ్యతిరేకించింది గుత్తా సుఖేందర్‌రెడ్డి ఒక్కరే అన్నారు. ప్రాణహిత ప్రాజెక్టుపై మహారాష్ట్ర సీఎంతో ఒక్కరోజైనా చర్చించలేదని, అలాగే పాలమూరు ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం మాదిరిగాను తెలంగాణ నేతలు కూడా మాట్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఇప్పటికే ఆరుసార్లు ముంబై వెళ్లారని, అలాగే సీఎం కేసీఆర్‌ మూడోసారి ముంబై వెళ్తున్నారని, అయితే కాంగ్రెస్‌ సీఎం ఒక్కసారైనా ముంబై వెళ్లారా? అని ఆయన ప్రశ్నించారు.

పెద్ద రిజర్వాయర్లతోనే సమస్యకు చెక్‌

ఇదిలావుంటే గోదావరి, కృష్ణా పరీవాహకంలో ప్రతి నీటి చుక్కను వినియోగించుకునేందుకు పెద్ద రిజర్వాయర్ల నిర్మాణం తప్పనిసరని ఇరిగేషన్‌ రిటైర్డ్‌ ఇంజనీర్ల ఫోరం స్పష్టం చేసింది. ఈ దృష్ట్యానే కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల్లో ఎక్కువ రిజర్వాయర్లను ప్రభుత్వం తలపెట్టిందని తెలిపింది. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఫోరం అధ్యక్షుడు చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, సాంబయ్య, సత్తిరెడ్డి తదితరుతలు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  కాంగ్రెస్‌ ప్రజెంటేషన్‌లో చెప్పిన అంశాలను ఫోరం సభ్యులు తప్పుపట్టారు. ప్రాణహిత -చేవెళ్ల పథకంలో భాగంగా ఉన్న తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత పుష్కలంగా లేనందునే మేడిగడ్డ నుంచి నీటిని తీసుకునే కాళేశ్వరం పథకాన్ని ప్రభుత్వం మొదలుపెట్టినట్లు రిటైర్డ్‌ ఇంజనీర్లు స్పష్టం చేశారు. ఇదే సమయంలో తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా సుందిళ్లకు నీటిని తెచ్చే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రిని కోరామని, దీనికి ఆయన సానుకూలత వ్యక్తం చేశారని చెప్పారు. ప్రతి నీటి చుక్కను వినియోగంలోకి తెచ్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టులో పైప్‌లైన్‌ ద్వారానే నీటిని సరఫరా చేసే విధానం పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించగా, దానికి సమ్మతించిందని అన్నారు. కాల్వలతో పోలిస్తే పైప్‌లైన్‌ నిర్మాణ వ్యవస్థ ఖర్చు తక్కువగా ఉండటం, ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే అవకాశాలుండటం, నీటి ఆదా సైతం హెచ్చుగా ఉన్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాల్వల ద్వారా టీఎంసీలకి 10వేల ఎకరాలకు మాత్రమే నీరిచ్చే అవకాశం ఉండగా, పైప్‌లైన్‌ వ్యవస్థలో 20వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశాలుంటాయని తెలిపారు. పైప్‌లైన్‌ నిర్మాణాలకు భూసేకరణ అవసరాలు తక్కువగా ఉండటంతో పాటు. అన్ని ప్రాంతాలకు సమానమైన నీటిని పంపిణీ చేసే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ విధానాన్ని పాలమూరు, డిండి ప్రాజెక్టుల్లోనూ అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.